బ్రేకింగ్ న్యూస్:
🔴 బాసర మహంకాళి ఆలయంలో చోరీ కలకలం
🔴 అమ్మవారి కిరీటం, హుండీ అపహరణ
🔴 డాగ్స్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలతో ముమ్మర దర్యాప్తు
🔴 అభిషేక సేవలు ఆలస్యం.. హుండీ లెక్కింపు ప్రక్రియ వాయిదా..
బాసర, జూన్ 23 (ప్రతినిధి):
నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఉన్న మహంకాళి అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. గుర్తుతెలియని దుండగులు ఆలయ తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి, మహంకాళి అమ్మవారి కిరీటంతో పాటు హుండీని అపహరించి పరారయ్యారు.
మంగళవారం వేకువజామున సుప్రభాత సేవల కోసం ఆలయానికి చేరుకున్న అర్చకులు తాళాలు విరిగిపోయి ఉండటం, హుండీ కనిపించకపోవడాన్ని గమనించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. డాగ్స్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధ్వర్యంలో ఆలయ పరిసరాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి ఆధారాలను సేకరిస్తున్నారు. చోరీకి పాల్పడిన దుండగుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
దొంగతనం ఘటన నేపథ్యంలో మహంకాళి అమ్మవారికి ప్రతిరోజు ఉదయం 4 గంటలకు నిర్వహించే అభిషేక సేవలు ఆలస్యంగా జరిగాయి. దర్యాప్తు పూర్తయ్యే వరకు మహంకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గాన్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు.
ఇదిలా ఉండగా, మంగళవారం నిర్వహించాల్సిన హుండీ లెక్కింపు ప్రక్రియను కూడా వాయిదా వేస్తున్నట్లు ఆలయ ఈవో ఆంజని దేవి ప్రకటించారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ఆలయ భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








