బోధన్, జూన్ 18:
బోధన్ పట్టణంలోని ఓ బేకరీలో విక్రయిస్తున్న పన్నీర్ స్ప్రింగ్ నాణ్యతపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వినియోగదారులు కొనుగోలు చేసిన పన్నీర్ స్ప్రింగ్‌లో ఉపయోగించిన పన్నీర్ సహజంగా కనిపించడం లేదని, అది నిజంగా పన్నీరేనా? లేక నాసిరకం పదార్థాలతో తయారు చేసిన ప్రత్యామ్నాయ ఉత్పత్తా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు
ఇదే సమయంలో, కొన్ని బేకరీలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హైవే పక్కన ఉన్న కొన్ని డాబా హోటళ్లలో ఆహార పదార్థాలను ఫ్రీజర్లలో రోజుల తరబడి నిల్వ ఉంచి తిరిగి వినియోగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా తయారు చేసిన ఆహారం పేరుతో నిల్వ ఉంచిన పదార్థాలను వినియోగదారులకు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తనిఖీలకు వెళ్లే ముందు సంబంధిత వ్యాపార సంస్థలకు సమాచారం చేరవేస్తున్నారని, దీంతో తనిఖీల ఉద్దేశ్యమే నీరుగారిపోతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. కొందరు అధికారులు తనిఖీలు చేపట్టామని ప్రజల ముందు ప్రదర్శన చేస్తున్నారే తప్ప, వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకురావడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బోధన్ మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదన్న ఆరోపణలు తరచూ వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. వంటశాలల్లో అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వ విధానంలో నిర్లక్ష్యం, నాసిరకం పదార్థాల వినియోగం వంటి అంశాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆహార భద్రత అనేది ప్రజల ఆరోగ్యానికి నేరుగా సంబంధించిన అంశం. అనుమానాస్పద ఆహార నమూనాలను వెంటనే సేకరించి ప్రయోగశాల పరీక్షలు నిర్వహించాలని, నాణ్యతలో లోపాలు తేలితే సంబంధిత యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే తనిఖీల సమాచారం ముందుగానే చేరవేస్తున్నారనే ఆరోపణలపై కూడా సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు తేలితే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

“ఆహారంలో కల్తీ చేసినవాడు ఒక్కరే కాదు… తెలిసి కూడా మౌనం వహించిన అధికారి కూడా అదే నేరంలో భాగస్వామి.”
ప్రజల ప్రశ్న:
“ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికైనా మేల్కొంటారా..? లేక మరో వైరల్ పోస్టు వచ్చే వరకు వేచి చూస్తారా..?”
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






