పెండింగ్ కేసులపై సమగ్ర సమీక్ష
వేగవంతమైన దర్యాప్తుకు అధికారులకు ఆదేశాలు
సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత వినియోగంపై దృష్టి
రామగుండం, ఏప్రిల్ 07 (V1 News Telangana):
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తులో ఉన్న కేసులు, వారెంట్ల అమలు తదితర అంశాలపై సీపీ సమగ్రంగా సమీక్షించారు. పాత పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దొంగతనాల నివారణ, కేసుల ఛేదనలో ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని సూచించారు. రికవరీ శాతం పెంచి బాధితులకు వారి సొత్తును తిరిగి అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. తరచూ చోరీలకు పాల్పడే వ్యక్తులపై హిస్టరీ షీట్లు తెరవాలని ఆదేశించారు.
చోరీలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలు, కాలనీలు, వ్యాపార సముదాయాల్లో కెమెరాల ఏర్పాటు చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఉన్న కెమెరాల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని స్టేషన్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్) గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం పాటిస్తూ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ “అరైవ్-అలైవ్” కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని పేర్కొన్నారు.
మహిళలు, చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి, వారి ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు. పెట్రోలింగ్ మరియు బ్లూ కోల్ట్స్ వాహనాలతో పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.
గంజాయి వంటి మత్తు పదార్థాలు, జూదం మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె. శ్రీనివాస్, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







