రిజర్వేషన్లు కాగితాలకే పరిమితం? మండల సమావేశాల్లో చట్టాల అవమానం..
పంచాయతీ రాజ్ యాక్ట్‌కు బహిరంగ ధిక్కారం – అధికారుల సమక్షంలోనే నియమాల ఉల్లంఘన…
మహిళా సాధికారతపై ప్రశ్నలు –
‘సర్పంచ్ సంవాద్’ సమావేశం సరదా సభగా మారిందా? హాజరు నమోదు పై అనుమానాలు..
నిజామాబాద్:
జిల్లాలోని పలు మండలాల్లో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఎన్నికైన మహిళా సర్పంచ్‌లు హాజరు కావాల్సిన సమావేశాలకు వారి భర్తలు హాజరుకావడం పరిపాలనా వ్యవస్థపై తీవ్ర విమర్శలకు కారణమైంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన అధికారుల సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గంభీరమైన పరిపాలనా వైఫల్యంగా అభివర్ణించబడుతోంది.
గ్రామ పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తోంది. కానీ ప్రాక్టికల్ స్థాయిలో మాత్రం ‘ప్రాక్సీ పాలన’ కొనసాగుతుందనే ఆరోపణలు మళ్లీ తెరపైకి వచ్చాయి. ఎన్నికల్లో గెలిచిన మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి కుటుంబ సభ్యులు అధికార కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి చెడు ఉదాహరణగా మారుతోంది..
Telangana Panchayat Raj Act, 2018 ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారిక సమావేశాలకు హాజరై నిర్ణయాలు తీసుకోవాలి. వారి స్థానంలో ఇతరులు పాల్గొనడం స్పష్టమైన చట్టవిరుద్ధ చర్య. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకుండా సమావేశాలు నిర్వహించడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.
ప్రత్యేకంగా Edapalli Mandal లో ఎనిమిది మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నప్పటికీ, ఒక్కరైనా సమావేశానికి హాజరుకాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ‘Sarpanch Samvad’ ఈ-మొబైల్ యాప్‌పై అవగాహన సమావేశం పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో హాజరు నమోదు ఎలా నిర్వహించబడిందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. అధికారిక గుర్తింపు ఉన్నవారు హాజరు కాకపోతే, హాజరు పట్టికపై సంతకాలు ఎలా జరిగాయి? అధికారులు ఎలా ఆమోదించారు? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
మండల ప్రజా పరిషత్ అధికారి, మండల పంచాయతీ అధికారి సమక్షంలో ఈ ఘటన జరగడం చట్టపరంగా మరియు నైతికంగా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల స్వతంత్ర అధికారాన్ని కాపాడటం ప్రభుత్వ యంత్రాంగపు ప్రాథమిక బాధ్యత.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మహిళా సాధికారత కేవలం నినాదంగా మిగలకూడదంటే, ప్రాక్సీ పాలనకు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









