నిజామాబాద్, మే 13:
రాబోయే బక్రీద్ పండుగను రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సి. వి. ఆనంద్, ఐపీఎస్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయి పోలీస్ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రంలోని అన్ని పోలీస్ కమిషనరేట్లు, జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, అదనపు డీసీపీలు, ఏసీపీలు మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య, ఐపీఎస్ పాల్గొన్నారు.

డిజిపి మాట్లాడుతూ బక్రీద్ పండుగను ప్రజలు పరస్పర సహకారంతో ప్రశాంతంగా జరుపుకునేలా పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా ప్రార్థనా స్థలాలు, ఈద్గాలు, మసీదులు, ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు మరియు జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
పండుగ రోజున ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించి, ఈద్గాల వద్ద పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపులు, అత్యవసర సేవలకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు, వదంతులు వ్యాప్తి చెందకుండా సైబర్ మానిటరింగ్‌ను బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు.
మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులతో ముందస్తు సమావేశాలు నిర్వహించి సామరస్య వాతావరణం నెలకొల్పాలని డిజిపి తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ పెంచాలని పేర్కొన్నారు.
అన్ని చెక్‌పోస్టుల్లో 24 గంటలు పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలని, పోలీస్, మునిసిపల్ మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. నిజామాబాద్ జిల్లా రెంజల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాఠాపూర్ పశువుల సంతలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పండుగ విధుల్లో పాల్గొనే పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, చిన్న ఘటనలకైనా వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని డిజిపి స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బక్రీద్ పండుగను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు.
ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) కిరణ్ కుమార్, జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండ్రీ గంగాధర్, ఆర్మూర్ డి.ఏ.ఓ అచ్యుత్ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీలు ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








