ఇసుక మాఫియాకు లోపలి సమాచారమే అండా..?
నిజామాబాద్ జిల్లా, సాలూరు మండలం, జూన్ 21:
సాలూరు మండలంలో రాత్రి వేళల్లో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రెవెన్యూ అధికారులు. మరియు పోలీస్. అధికారులు విధులు నిర్వహిస్తున్నప్పటికీ, సాలూరా, ఖాజాపూర్, హుంసా ప్రాంతాల నుంచి బోలెరో వాహనాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న ప్రాంతాలను ముందుగానే గుర్తిస్తూ, ప్రధాన రహదారులను విడిచిపెట్టి కొమ్మనపల్లి, సాలంపాడ్, పెంట గ్రామాల మీదుగా అడ్డదారుల్లో ఇసుక వాహనాలను నడుపుతున్నట్లు సమాచారం. అనంతరం ఈ వాహనాలు బోధన్ వైపు వెళ్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

మరింత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, అధికారులు ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని కొందరు కిందిస్థాయి సిబ్బంది అక్రమ రవాణాదారులకు చేరవేస్తున్నారనే వినికిడి స్థానికంగా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా, కొందరు పాత్రికేయ మిత్రులు కూడా అధికారుల కదలికలను గమనిస్తూ, తనిఖీల సమాచారం అక్రమ ఇసుక వాహన యజమానులకు చేరవేస్తూ వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ సమాచారం ఆధారంగానే ఇసుక వాహనాలు తనిఖీలను తప్పించుకుని అడ్డదారుల్లో నిరాటంకంగా సంచరిస్తున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో అక్రమ ఇసుక రవాణా వెనుక ఎవరి హస్తం ఉంది..? లోపలి సమాచారం ఎవరెవరి ద్వారా బయటకు వెళ్తోంది..? అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నది ఎవరు..? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణా కారణంగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లడంతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా దెబ్బతింటోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి, సమాచారం లీక్ చేస్తున్న వారెవరో గుర్తించి, అక్రమ రవాణాకు సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
గమనిక: ఈ కథనంలో పేర్కొన్న అంశాలు స్థానికుల ఆరోపణలు, వినికిడి సమాచారం ఆధారంగా ప్రచురించబడుతున్నాయి. సంబంధిత అధికారులు లేదా ప్రస్తావించబడిన వ్యక్తుల స్పందన అందిన వెంటనే ప్రచురించబడుతుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







