త్వరలో తెలంగాణ హమాలీ కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు: మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, జూన్ 17: తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు సాధన కోసం బుధవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఉదయం ప్రారంభమైన ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హాజరై మాట్లాడారు. కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో అమలులో ఉన్న హమాలీ కార్మిక సంక్షేమ బోర్డుల విధానాలను అధ్యయనం చేసి, యూనియన్ ప్రతినిధులతో కలిసి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, తెలంగాణలో కూడా హమాలీ కార్మిక సంక్షేమ బోర్డును త్వరలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. హమాలీ కార్మికుల సమస్యలపై తమకు పూర్తి అవగాహన ఉందని మంత్రి పేర్కొన్నారు.
సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, రైతు స్వరాజ్య వేదిక నాయకుడు కన్నెగంటి రవి, ఎంవీ ఫౌండేషన్ ప్రతినిధి ఆర్. వెంకటరెడ్డి, సంఘమిత్ర ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మీరా, భారత నాస్తిక సంఘం అధ్యక్షుడు జీడీ సార్తో పాటు తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

సమావేశంలో అతిథులు ఇచ్చిన సూచనలు, సలహాలను అనుసరిస్తూ రాష్ట్రంలోని 80 డివిజన్ల ఆర్డీవో కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాల్లో హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, స్థానిక సమస్యలపై వివరణాత్మక మెమోరాండాలను సమర్పించాలని నిర్ణయించారు. అలాగే యూనియన్ సభ్యత్వాలను పెంచడం, ప్రతి జిల్లాలో జిల్లా కమిటీలను ఏర్పాటు చేయడం వంటి అంశాలపై చర్చించి పలు తీర్మానాలను ఆమోదించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






