సాలూరు, మే 15:
సాలూరు మండలం ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ భూములు, పంట కాలువలు, పానాధులు, డ్రైనేజీ మార్గాలు వరుసగా కబ్జాలకు గురవుతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో పాటు కొందరు స్థానిక నాయకుల అండదండల వల్ల ఆక్రమణలు రోజురోజుకు పెరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ భూములపై అక్రమ ఆక్రమణలు జరిపేది ఒక వర్గమైతే, వాటిపై వివాదాలు సృష్టించి సెటిల్మెంట్లు నిర్వహించేది కూడా అదే వర్గమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ధర్నాలు చేయించేది వాళ్లే… అధికారులకు నోటీసులు ఇవ్వమని ఒత్తిడి తెచ్చేది వాళ్లే… చివరకు మధ్యవర్తిత్వం పేరిట లాభాలు పొందేది కూడా వాళ్లేనని ప్రజలు మండిపడుతున్నారు.

ఆక్రమణలపై అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, శాశ్వత చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. “కబ్జాలు చేసేది వాళ్లే… భూములు అమ్మేది వాళ్లే… పథకాల లబ్ధిదారులను కూడా నిర్ణయించేది వాళ్లే” అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక మాఫియా నుంచి భూకబ్జాల వరకు ప్రతి అక్రమ వ్యవహారంలో కొందరు స్థానిక నాయకుల ప్రమేయం ఉందని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. అధికారులకు అనుకూలంగా నడవకపోతే ఇబ్బందులు సృష్టించడం, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తమ ప్రభావాన్ని చూపించడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా, వీరి ప్రభావం మాత్రం తగ్గడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. “24 గంటల సేవ” పేరుతో అక్రమ వ్యవహారాలకు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ తెస్తున్న ఇలాంటి వ్యవహారాలపై జిల్లా ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించి, ఆక్రమణల వెనుక ఉన్న అసలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








