V1News Telangana

best news portal development company in india

కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం ,చేతల ప్రభుత్వం కాదు….

SHARE:

– కష్టకాలంలో పార్టీని వీడారని పోచారం శ్రీనివాస్ రెడ్డి పై మండిపాటు

– కెసిఆర్ బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పదివేల కోట్లు నిధులు మంజూరు చేశారు

– ఆటో డ్రైవర్లకు రూ.12000 జీవన భృతి ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్.

– నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని పార్టీ శ్రేణులకు మనోధైర్యం

– బాన్సువాడ లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

బాన్సువాడ ప్రతినిధి:

కామారెడ్డి జిల్లా: ఎమ్మెల్సీ కవిత ఆదివారం రోజు బాన్సువాడ పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మహిళా కార్యకర్తలు మంగళ హారతులు, బతుకమ్మలు, బోనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రమంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. గజమాలతో ఆమెను సత్కరించారు.
అనంతరం బిఆర్ఎస్ పార్టీ నాయకులు షేక్ జుబేర్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం లో బంగారం లాంటి నిజాయితీగల కార్యకర్తలు ఉన్నారని అన్నారు. రాజకీయ పార్టీలలో నాయకులు ఉంటారు, పోతారు కానీ కార్యకర్తలు నిజాయితీగా పనిచేస్తారని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి కెసిఆర్ ను, ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కెసిఆర్ అధికారంలో ఉన్నప్పుడు బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి పోచారం శ్రీనివాస్ రెడ్డి అడిగిందే తడవుగా మారు మాట మాట్లాడకుండా నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు.

పది సంవత్సరాల కాలంలో అభివృద్ధికి పదివేల కోట్లు నిధులు ఇచ్చారని తెలిపారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర రూ.1000 కోట్లు తీసుకురాగలరా అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలతో, ఆచరణ సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కోతల ప్రభుత్వం.. చేతల ప్రభుత్వం కాదని ఎద్దేవా చేశారు. బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిధులతోనే బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఛాలెంజ్ చేశారు. ఏమి అభివృద్ధి చేస్తానని పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారారని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లకు జీవన భృతి రూ.12000 ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. బిఆర్ఎస్ హయాంలో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు ఎక్కువగా జరిగేవి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనబడడం లేదు అన్నారు. ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గంలో బిఆర్ జెండా ను ఎగురవేసే వరకు అలుపెరుగని పోరాటం చేద్దామని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, నాయకులు మోచి గణేష్, రమేష్ యాదవ్, శివ సూరి, అఫ్రోజ్, నర్సింలు గౌడ్, టేకుర్ల సాయిలు, చుంచు శేఖర్, మంగలి సాయికుమార్, దేశ్పాక్ సాయిలు, అల్లం గంగారాం,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Burugula Mahesh goud
Author: Burugula Mahesh goud

బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..

best news portal development company in india