-- --

రియాద్ జైలులో బోధన్ యువకుడి నరకయాతన.. విడుదలకు రూ.84 లక్షల ‘బ్లడ్ మనీ’!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

సాలూర మండలం కుమ్మన్‌పల్లి యువకుడు రెండేళ్లుగా జైలులోనే.. భర్తను విడిపించాలంటూ దివ్యాంగ భార్య వేడుకోలు..

బోధన్, ఆగస్టు 20: పొట్టకూటి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన బోధన్ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదం కేసులో రెండేళ్లుగా రియాద్ జైలులో మగ్గుతున్నాడు. కోర్టు తీర్పు ప్రకారం బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాల్స్ (సుమారు రూ.84 లక్షలు) ‘బ్లడ్ మనీ’గా చెల్లించాల్సి రావడంతో.. ఆ మొత్తాన్ని చెల్లించలేక కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. భర్తను ఎలాగైనా జైలు నుంచి విడిపించి స్వదేశానికి తీసుకురావాలని దివ్యాంగురాలైన భార్య చంటి బిడ్డతో ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతోంది.

సాలూర మండలం కుమ్మన్‌పల్లికి చెందిన యువకుడు

బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రామయ్య, రాజమణి దంపతుల కుమారుడు శ్రావణ్‌కుమార్ (22). చింతల్‌పేట్‌కు చెందిన దివ్యాంగురాలు మమతను వివాహం చేసుకున్నాడు. కుటుంబ పోషణ కోసం సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి ఓ ప్రైవేట్ మెడికల్ రీసెర్చ్ సంస్థలో అంబులెన్స్ డ్రైవర్‌గా ఉద్యోగంలో చేరాడు.

2024లో ఘోర రోడ్డు ప్రమాదం

2024 మే 6న శ్రావణ్‌కుమార్ నడుపుతున్న అంబులెన్స్ రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో స్థానికంగా నివసించే భార్యాభర్తలు మృతి చెందగా.. వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఘటన అనంతరం సౌదీ పోలీసులు శ్రావణ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

ఈ కేసులో సౌదీ అరేబియా కోర్టు శ్రావణ్‌కుమార్‌ను దోషిగా నిర్ధారించినట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు. బాధిత కుటుంబానికి 3.30 లక్షల సౌదీ రియాల్స్ ‘బ్లడ్ మనీ’గా చెల్లించాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. భారత కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.84 లక్షలకు సమానం. ఈ మొత్తాన్ని చెల్లిస్తేనే శ్రావణ్‌కుమార్ విడుదలకు అవకాశం ఉందని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు.

ఆర్థిక స్థోమత లేక కన్నీటి పర్యంతం

నిరుపేద కుటుంబానికి చెందిన శ్రావణ్‌కుమార్ కుటుంబం అంత భారీ మొత్తాన్ని సమకూర్చలేక దిక్కుతోచని పరిస్థితిలో పడింది. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడు జైలులో ఉండటంతో వృద్ధ తల్లిదండ్రులు సైతం కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబసభ్యులు వాపోతున్నారు.

మరోవైపు దివ్యాంగురాలైన భార్య మమత తన చంటి బిడ్డను వెంటబెట్టుకుని భర్తను జైలు నుంచి విడిపించేందుకు ప్రజాప్రతినిధులను ఆశ్రయిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలకు వినతిపత్రాలు అందజేసినట్లు ఆమె తెలిపింది. హైదరాబాద్‌లో ఇటీవల నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలోనూ తన భర్త పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరినట్లు పేర్కొంది.

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

“మా కుటుంబానికి రూ.84 లక్షలు చెల్లించే స్థోమత లేదు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, దాతలు, మానవతావాదులు స్పందించి ఆర్థిక సహాయం అందించి నా భర్తను స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలి” అని మమత కన్నీటి పర్యంతమవుతూ వేడుకుంటోంది.

రెక్కల కష్టంతో జీవించే తమ కుటుంబాన్ని ఆదుకుని శ్రావణ్‌కుమార్‌ను స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more