సైబర్ నేరాలు, రహదారి భద్రత, విద్యుత్ ప్రమాదాలు, పాముకాటుపై ప్రజలకు బోధన్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ సూచనలు…
సాలూర, జూలై 18 (వి1 న్యూస్):
బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాలూర మండల కేంద్రంలో శనివారం “మన ఊరు–మన భద్రత–మన బాధ్యత” పేరుతో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని బోధన్ రూరల్ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించరాదని హెచ్చరించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర పరిస్థితులు కనిపిస్తే వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.
పాముకాటు వంటి అత్యవసర పరిస్థితుల్లో మూఢనమ్మకాలను నమ్మకుండా బాధితుడిని వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని, గ్రామ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పాములు, విషపురుగుల బెడదను తగ్గించవచ్చని వివరించారు.
గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మాదకద్రవ్యాల విక్రయం లేదా ఇతర నేరాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేసి ప్రజలు సహకరించాలని ఎస్ఐ రాజశేఖర్ కోరారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
“జాగ్రత్తే ప్రాణ రక్షణకు మొదటి మెట్టు.”
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832









