బోధన్, జులై 17 (వి.1 న్యూస్ ప్రతినిధి):
బోధన్ పట్టణంలో శుక్రవారం శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర భక్తిశ్రద్ధల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. సేవకుంజ్ భక్త బృందం ఆధ్వర్యంలో వరుసగా ఆరో ఏడాది నిర్వహించిన ఈ రథయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు హాజరై హరినామ స్మరణ, భజన కీర్తనలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పారు.
రాకాసిపేట్ బస్టాప్ వద్ద ఉన్న సేవకుంజ్ నుంచి ప్రారంభమైన రథయాత్రకు మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. పుష్పాలతో సుందరంగా అలంకరించిన రథంపై శ్రీ జగన్నాథ స్వామి, బలభద్రుడు, సుభద్రమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి ఊరేగింపుగా తీసుకెళ్లారు.
అంబేద్కర్ చౌరస్తా, పెద్ద హనుమాన్ మందిరం, కొత్త బస్టాండ్ మీదుగా సాగిన రథయాత్రలో భక్తులు “హరే రామ.. హరే కృష్ణ” నామస్మరణ చేస్తూ స్వామివారికి నీరాజనాలు సమర్పించారు. జిహెచ్. జనివాస్ దాస్ ప్రభుజీ హరికథ గానం, జిహెచ్. గౌర్ గోపాల్ దాస్ అధికారి నేతృత్వంలో జరిగిన హరినామ సంకీర్తనలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తాయి.

రథయాత్ర టిటిడి కళ్యాణ మండపం వద్దకు చేరుకోవడంతో కార్యక్రమం ముగిసింది. అనంతరం నిర్వాహకులు భక్తులకు మహా అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, సేవకుంజ్ భక్త బృందం ప్రతినిధులు విటల్ ప్రభు, వైశాలి మాతాజీ, శ్రీరామ్ ప్రభు, రవి ప్రభు, శ్యామ్ ప్రభు, మాధవి మాతాజీ, వాణి మాతాజీ, శాంతి మాతాజీతో పాటు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







