-- --

బోధన్ డివిజన్‌లో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు – పండుగల బందోబస్తు, రోడ్డు భద్రతపై ప్రత్యేక దృష్టి: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

పాత నేరస్థులపై నిఘా, డ్రగ్స్–గుట్కా–పేకాటపై నిర్విరామ దాడులు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ…

బోధన్, జూలై 8: రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ అధికారులను ఆదేశించారు.

బుధవారం బోధన్ రూరల్ సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన బోధన్ డివిజన్ పోలీసు అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ పెండింగ్ కేసుల పురోగతి, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ చర్యలను సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో ఏసీపీలు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌హెచ్‌ఓలు, ఎస్‌ఐలు తదితర అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు రాబోయే పండుగల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, 24 గంటలపాటు వాహనాల తనిఖీలు నిర్వహించాలని కమిషనర్ సూచించారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

హత్యలు, హత్యాయత్నాలు, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారాలకు సంబంధించిన కేసులపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన వ్యక్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పహారా బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టం చేయాలని సూచించారు.

బోధన్ డివిజన్ మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకుని ఉండటంతో సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, మహారాష్ట్ర పోలీసులతో సమన్వయం పెంచుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, షీ టీమ్స్, ఈగల్ టీమ్స్, చీతా ఫోర్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఆన్‌లైన్ మోసాల బాధితులకు వెంటనే సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగిస్తూ, అవసరమైతే పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పేకాట, గుట్కా, అక్రమ ఇసుక రవాణా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిరంతర దాడులు కొనసాగించాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని, స్టేషన్ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, క్రమశిక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, లింక్ రోడ్ల వద్ద స్పీడ్ బ్రేకర్లు నిర్మించాలని, రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించాలని సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడం, ఓవర్ స్పీడ్, త్రిబుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. అలాగే రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో బోధన్ ఏసీపీ పి. శ్రీనివాస్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, బోధన్, బోధన్ రూరల్, రుద్రూర్, ఎడపల్లి, రెంజల్, వర్ని, కోటగిరి పోలీస్ స్టేషన్ల అధికారులు, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more