June 2, 2026 10:59 pm

V1News Telangana

సాలూర్–బోధన్ సరిహద్దులో ఇసుక మాఫియా రాజ్యం?

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ధాబాలే అడ్డాలా.. అధికారులే అండలా?
సామాన్యుడికే చట్టమా?.. మాఫియాకు మినహాయింపా?

సాలూర్, జూన్ 1 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా సాలూర్ మండల పరిధిలోని హుంసా, ఖాజాపూర్, మందర్న, తెగ్గెల్లి సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న ఆరోపణలు రోజురోజుకూ తీవ్రతరమవుతున్నాయి. సాలూర్–బోధన్ ప్రధాన రహదారిపై ఇసుకతో నిండిన ట్రాక్టర్లు, టిప్పర్లు, ట్రాలీ ఆటోలు, బొలెరో వాహనాలు పట్టపగలే సంచరిస్తున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడం స్థానిక ప్రజల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది.
ఒకవైపు చిన్న వ్యాపారులు, చిరు దుకాణాల యజమానులు, సామాన్య ప్రజలపై సమయపాలన, లైసెన్సులు, నిబంధనలు, చట్టాలు అంటూ అధికారులు కఠినంగా వ్యవహరిస్తుంటే.. మరోవైపు అక్రమాలకు కేంద్రాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొన్ని ధాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బెల్ట్ షాపుల విషయంలో మాత్రం ఎందుకు మౌనం పాటిస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికుల ఆరోపణల ప్రకారం, రాత్రి వేళల్లో కొన్ని ధాబా హోటళ్లు అక్రమ ఇసుక రవాణాదారులకు తాత్కాలిక స్థావరాలుగా మారుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. వాహనాల నిలుపుదల, డ్రైవర్లకు సౌకర్యాలు, సమాచార మార్పిడి వంటి అంశాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ సంబంధిత శాఖలు ఇప్పటివరకు సమగ్ర తనిఖీలు నిర్వహించిన దాఖలాలు కనిపించడం లేదని గ్రామస్తులు పేర్కొంటున్నారు.

 

సామాన్యుడికే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.. ధాబాలకు ప్రత్యేక చట్టమా?”

అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ధాబాల్లో రాత్రి వేళల్లో మద్యం సిట్టింగులు, అనుమానాస్పద రాకపోకలపై తరచూ ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇక సరిహద్దు ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పేరుతో విధులు నిర్వహించే కొందరు కింది స్థాయి అధికారులు అక్రమాలు జరిగే సమయంలో మాత్రం కనిపించరనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అక్రమ రవాణా జరిగే సమయాలు, మార్గాలు తెలిసినా తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.
మరోవైపు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఇసుక రీచ్‌ల వ్యవహారం కూడా మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో ఇదే అంశంపై పలువురు అధికారులు, సామాజిక కార్యకర్తలు, గ్రామ పెద్దలు తీవ్రంగా స్పందించారు. ఇరు రాష్ట్రాల అధికారులు సంయుక్త సర్వేలు నిర్వహించి వాస్తవాలు బయటపెడతామని ప్రకటించారు. అయితే ప్రస్తుతం అదే అంశంపై ఎవరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

సర్వేలు చేస్తామన్న అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అప్పట్లో గళమెత్తిన కొందరు కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు? అక్రమాలపై ప్రశ్నించినవారే ఇప్పుడు మౌనంగా ఉండటానికి కారణం ఏమిటి?

అనే ప్రశ్నలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.
చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వాటి ఫుటేజీని పరిశీలించి వాస్తవాలు వెలికితీసే ప్రయత్నం ఎందుకు జరగడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. సరిహద్దు ప్రాంతాల్లో జరిగే రవాణాపై పూర్తి స్థాయి ఆడిట్ నిర్వహిస్తే అసలు నిజాలు బయటపడతాయని వారు అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖలు సంయుక్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ధాబాలు, చెక్‌పోస్టులు, సరిహద్దు రీచ్‌లు, ఇసుక రవాణా మార్గాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమాలకు ఎవరు పాల్పడినా, ఎవరు సహకరించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రజల ప్రశ్నలు…

ఇసుక మాఫియా ఇంత ధైర్యంగా వ్యవహరించడానికి కారణం ఏమిటి?
ధాబాలు నిజంగానే అక్రమ రవాణాకు అడ్డాలుగా మారాయా?
సర్వేలు చేస్తామన్న అధికారులు ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు?
గళమెత్తిన కార్యకర్తలు, గ్రామ పెద్దలు ఎందుకు స్పందించడం లేదు?
సామాన్యుడికే చట్టమా? మాఫియాకు మినహాయింపా?

 

“”ఎమ్మెల్యే సాబ్… మీ హయాంలో సరిహద్దు ప్రాంతాల్లో ఏమి జరుగుతోందో ఒకసారి పరిశీలించండి.

ప్రజల్లో పెరుగుతున్న అనుమానాలకు అధికారులే సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది” అని స్థానికులు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more