-- --

సౌదీ అరేబియాలో చిక్కుకున్న తెలంగాణ యువకుడికి సాటా అండ…

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

మానవతా దృక్పథంతో స్పందించి స్వదేశానికి చేర్చిన సాటా రియాద్ బృందం…

ముజమ్మిలుద్దీన్, మంద భీమ్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిష్కారమైన యువకుడి సమస్య..

 

రియాద్, నవంబర్ 19:

ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అనుకోని పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయులకు అండగా నిలుస్తూ, మానవతా సేవా కార్యక్రమాల్లో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. సౌదీ అరేబియాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ యువకుడు చింటూ పఠానిని సురక్షితంగా స్వదేశానికి పంపించేందుకు సాటా రియాద్ బృందం చేసిన కృషి ఫలించింది. నెలల తరబడి సాగిన ప్రయత్నాల అనంతరం నిర్మల్ జిల్లా సారంగాపూర్‌కు చెందిన చింటూ పఠాని నవంబర్ 19, 2026న భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.

ఉద్యోగం పేరుతో మోసం.. తీవ్ర ఇబ్బందులు…

ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన చింటూ పఠానికి డ్రైవర్ ఉద్యోగం కల్పిస్తామని చెప్పి, గొర్రెల కాపరిగా పని చేయించడంతో ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితులను తట్టుకోలేక కఫీల్ వద్ద నుంచి బయటకు వచ్చిన ఆయన, అనంతరం రియాద్‌లోని తన స్నేహితుడి వద్ద ఆశ్రయం పొందారు. అయితే, ఆయన వద్ద పాస్‌పోర్ట్, ఇఖామా రెండూ లేకపోవడంతో స్వదేశానికి తిరిగి రావడం పెద్ద సమస్యగా మారింది.

సమస్య తెలుసుకుని స్పందించిన సాటా బృందం…

చింటూ పఠాని ఎదుర్కొంటున్న దీనస్థితిని గమనించిన ఆయన స్నేహితులు సౌదీ అరేబియా తెలుగు అసోసియేషన్ (SATA) ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సాటా రియాద్ బృందం యువకుడిని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సంబంధిత అధికారులతో సమన్వయం ప్రారంభించింది.

ఇదిలా ఉండగా, చింటూ తల్లి తెలంగాణ ప్రభుత్వ ప్రజావాణి ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD), ఎన్‌ఆర్‌ఐ సెల్‌కు ఫిర్యాదు చేశారు. సాటా తరఫున ముజమ్మిలుద్దీన్ ఇండియన్ ఎంబసీ అధికారులతో పాటు తెలంగాణ GAD, NRI సెల్ ప్రతినిధులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. తెలంగాణ GAD, NRI సెల్ వైస్ ప్రెసిడెంట్ మంద భీమ్ రెడ్డి కూడా ప్రత్యేక చొరవ తీసుకుని అవసరమైన చర్యల కోసం కృషి చేశారు. వీరి సమన్వయంతో చింటూ పఠాని స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు మార్గం సుగమమైంది.

సహకరించిన సాటా ప్రతినిధులు…

ఈ సహాయక చర్యల్లో సాటా రియాద్ అధ్యక్షుడు శ్రీనివాస్‌తో పాటు మహమ్మద్ నూరుద్దీన్, మిథున్ సురేష్, సింగు నరేశ్, ముదిగొండ శంకర్, సాటా వ్యవస్థాపకుడు మల్లేష్ తదితరులు తమ వంతు సహకారం అందించారు.

విదేశాల్లో ఉపాధి కోసం వెళ్లి ఇబ్బందుల్లో చిక్కుకున్న వారికి అవసరమైన సమయంలో అండగా నిలవడం, సంబంధిత అధికారులతో సమన్వయం చేయడం, బాధితులు స్వదేశానికి చేరుకునేలా సహకరించడం వంటి సేవా కార్యక్రమాల్లో ప్రవాస తెలుగు సంఘాల పాత్ర ఎంతో కీలకమని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

ఒక యువకుడు విదేశాల్లో ఎదుర్కొంటున్న సమస్యను తమ సమస్యగా భావించి, నెలల తరబడి ప్రయత్నాలు కొనసాగించి స్వదేశానికి చేరుకునేలా సహకరించిన సాటా రియాద్ బృందం కృషి అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు.

ఈ సందర్భంగా చింటూ పఠాని స్వదేశీ ప్రయాణానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన సాటా కోర్ టీమ్ సభ్యులకు, భారత రాయబార కార్యాలయ అధికారులకు, తెలంగాణ ప్రభుత్వ GAD, NRI సెల్ ప్రతినిధులకు, అలాగే సహకరించిన స్నేహితులందరికీ సాటా రియాద్ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది….

ఆపదలో ఉన్న ప్రవాస భారతీయులకు అండగా నిలవడమే లక్ష్యంగా సాటా చేస్తున్న సేవా ప్రయత్నాలు ప్రశంసనీయమని ఈ ఘటన తెలియజేస్తోంది.
వాస్తవాలపై ముందడుగు
Author: వాస్తవాలపై ముందడుగు

V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”

Leave a Comment

Read more
Read more