బోధన్‌లో స్కానింగ్ సెంటర్ల తనిఖీ.. నిర్వాహకుడి తీరుపై డీఎంహెచ్‌ఓ రాజశ్రీ ఆగ్రహం
బోధన్, సెప్టెంబర్ 10 (వి.1 న్యూస్):
బోధన్ పట్టణంలోని పలు స్కానింగ్ సెంటర్లలో గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రాజశ్రీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్కానింగ్ కేంద్రాల్లో ప్రభుత్వ నిబంధనలు, వైద్య విధానాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆమె పరిశీలించారు.

ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ కృష్ణ స్కానింగ్ సెంటర్‌లో నిబంధనల అమలుపై డీఎంహెచ్‌ఓ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కేంద్రం నిర్వాహకులను ఆమె హెచ్చరించారు.
అయితే తనిఖీల సమయంలో స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు అధికారితో దురుసుగా మాట్లాడటంతో పాటు అమర్యాదగా ప్రవర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో అక్కడ కొంతసేపు డీఎంహెచ్‌ఓ, సెంటర్ నిర్వాహకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని రాజశ్రీ స్పష్టం చేసినట్లు సమాచారం.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుల తీరుపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓ పోలీసులను కోరినట్లు తెలిసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే ప్రక్రియ చేపడతామని బోధన్ పట్టణ ఎస్‌హెచ్‌ఓ వెంకట్ నారాయణ తెలిపారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు
వైద్య సేవలకు సంబంధించిన కేంద్రాలు ప్రభుత్వ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో నిర్లక్ష్యం లేదా నిబంధనల ఉల్లంఘనను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని డీఎంహెచ్‌ఓ రాజశ్రీ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్తామని ఆమె పేర్కొన్నారు.
స్కానింగ్ కేంద్రాల నిర్వహణలో నిబంధనల అమలుపై అధికారులు మరింత కఠినంగా వ్యవహరించనున్న నేపథ్యంలో.. బోధన్‌లోని ఇతర స్కానింగ్ కేంద్రాల్లోనూ తనిఖీలు జరుగుతాయా? నిబంధనలు పాటించని కేంద్రాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








