పాడైన మయోనైస్, కుళ్లిన టమాటాలు.. సింథటిక్ రంగులతో చికెన్, జిలేబీలు
5 సంస్థలకు మూసివేత నోటీసులు — లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక
బోధన్, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్):
బోధన్ పట్టణంలో ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న ఆహార సంస్థలపై అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ ఆహార భద్రతా అధికారి జి. నవిత ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా, రాకాసిపేట పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, టీ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా పలు సంస్థల్లో అపరిశుభ్రమైన పరిస్థితులు, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యం గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో 3.5 కిలోల పాడైన మయోనైస్, 10 కిలోల కుళ్లిన టమాటాలు గుర్తించి అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అలాగే సింథటిక్ రంగులు కలిపిన చికెన్, జిలేబీలు గుర్తించిన అధికారులు వాటిని కూడా వినియోగానికి పనికిరావని నిర్ధారించి నాశనం చేశారు.

లైసెన్స్ లేకుంటే వ్యాపారం బంద్
తనిఖీల్లో తీవ్ర అపరిశుభ్రతతో పాటు FSSAI లైసెన్స్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న 5 ఆహార సంస్థలకు మూసివేత నోటీసులు జారీ చేశారు. సంబంధిత సంస్థలు ఆహార భద్రతా నిబంధనల ప్రకారం లోపాలను సరిదిద్దుకోవడంతో పాటు తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందిన తర్వాతే వ్యాపార కార్యకలాపాలు కొనసాగించాలని అధికారి స్పష్టం చేశారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని,
ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత, లైసెన్సింగ్ నిబంధనలను ఉల్లంఘించే సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆహార భద్రతా అధికారులు హెచ్చరించారు.
ప్రజలు కూడా ఆహారం కొనుగోలు చేసే సమయంలో పరిశుభ్రత, నాణ్యత, FSSAI లైసెన్స్ వంటి అంశాలను గమనించాలని అధికారులు సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







