బోధన్‌లో ఘనంగా 41వ వర్ధంతి కార్యక్రమం.. స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని డిమాండ్
బోధన్, సెప్టెంబర్ 10 (వి.1 న్యూస్): తెలంగాణ సాయుధ పోరాటంలో భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమని సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి బి. మల్లేష్ అన్నారు.
చాకలి ఐలమ్మ 41వ వర్ధంతిని పురస్కరించుకుని గురువారం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా బి. మల్లేష్ మాట్లాడుతూ.. నిజాం పాలన కాలంలో భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. తన పొలంలోని పంటను భూస్వామి విసునూరు రామచంద్రారెడ్డి అనుచరులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలో ఆమె ధైర్యంగా ఎదురొడ్డి నిలిచారని తెలిపారు. ఆమె పోరాటం తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నారు.

తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలను ప్రస్తావించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తన పదేళ్ల పాలనలో బోధన్ పట్టణంలో ఐలమ్మ స్మారక స్థూపం ఏర్పాటు చేయలేదని మల్లేష్ విమర్శించారు. ప్రస్తుత ప్రజా పాలనలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
స్థలం కేటాయింపుపై హామీ
చాకలి ఐలమ్మ విగ్రహం, స్మారక స్థూపం ఏర్పాటుకు బోధన్ మున్సిపాలిటీలో స్థలం కేటాయించేలా తీర్మానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కౌన్సిలర్ తూము శరత్ రెడ్డి తెలిపారు. స్థలం ఎక్కడ కేటాయించారనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామని, స్మారక స్థూపం నిర్మాణానికి విరాళాలు సేకరించి సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం పట్టణ అధ్యక్షుడు మల్లెపూల శంకర్, సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, దాము, సంగ్రామ్, రవి, నక్క లింగారెడ్డి, ఎం. బెల్లీ గంగారాం, దీపక్, నవీన్, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం నాయకుడు పడాల శంకర్, టీయూసీఐ నాయకులు యాదగిరి గౌడ్, మోహన్, డి. నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








