బోధన్, జూన్ 26:
సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పంథాలు అవలంబిస్తూ అమాయక ప్రజలను భారీగా మోసం చేస్తున్నారు. తాజాగా బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి ఫోన్ క్లోనింగ్ యాప్ ఉచ్చులో చిక్కుకుని రూ.6,70,308 కోల్పోయిన ఘటన కలకలం రేపింది.
పోలీసుల వివరాల ప్రకారం, బాధితుడు తెలియకుండానే తన మొబైల్ ఫోన్‌లో ఫోన్ క్లోనింగ్/రిమోట్ యాక్సెస్‌కు సంబంధించిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్నాడు. ఈ అవకాశాన్ని వినియోగించుకున్న సైబర్ కేటుగాళ్లు అతని మొబైల్‌పై పూర్తి నియంత్రణ సాధించి, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన OTPలు, ఇతర ధృవీకరణ వివరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం బాధితుడికి తెలియకుండానే అతని బ్యాంకు ఖాతా నుంచి రూ.6,70,308ను విడతల వారీగా వివిధ ఖాతాలకు బదిలీ చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ ఎం. రాజశేఖర్ తెలిపారు.

ఈ సందర్భంగా బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు మాట్లాడుతూ, ఇటీవల ఫోన్ క్లోనింగ్, స్క్రీన్ షేరింగ్, రిమోట్ యాక్సెస్ యాప్‌ల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతున్నాయని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులు, APK ఫైళ్లు లేదా అనుమానాస్పద యాప్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్‌లోడ్ చేయవద్దని సూచించారు.
అదేవిధంగా బ్యాంకు ఖాతా వివరాలు, ATM PIN, UPI PIN, OTP వంటి గోప్యమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించాలని కోరారు. త్వరితగతిన ఫిర్యాదు చేస్తే నష్టపోయిన నగదును నిలిపివేయడం లేదా తిరిగి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు.
ఈ కేసులో సాంకేతిక ఆధారాలను సేకరిస్తూ నిందితులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







