June 6, 2026 12:19 am

V1News Telangana

మంజీరా జాయింట్ సర్వేకు మహారాష్ట్ర అధికారుల గైర్హాజరు సర్వేపై అనిశ్చితి.. సరిహద్దు ప్రాంతంలో పికెటింగ్ ఏర్పాటు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

బోధన్ రూరల్, జూన్ 5 (వి1 న్యూస్):

మంజీరా నదీ సరిహద్దు ప్రాంతంలో శుక్రవారం నిర్వహించాల్సిన తెలంగాణ–మహారాష్ట్ర జాయింట్ సర్వే అనూహ్యంగా నిలిచిపోయింది. సర్వే కోసం తెలంగాణ రెవెన్యూ అధికారులు, సర్వేయర్లు, సంబంధిత శాఖల సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ, మహారాష్ట్ర రెవెన్యూ అధికారులు హాజరుకాకపోవడంతో సర్వే ప్రక్రియ ముందుకు సాగలేదు.

సరిహద్దు ప్రాంతాల్లో భూసరిహద్దుల నిర్ధారణ, నదీ పరివాహక ప్రాంతాల గుర్తింపు, అక్రమ ఇసుక తవ్వకాల ఆరోపణలపై స్పష్టత తీసుకురావడమే ఈ జాయింట్ సర్వే ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు పేర్కొన్నారు. అయితే మహారాష్ట్ర అధికారుల గైర్హాజరుతో సర్వేపై అనిశ్చితి నెలకొంది.

తెలంగాణ అధికార వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్ర అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నామని, సర్వేయర్లు వస్తున్నారని సమాచారం ఇచ్చినప్పటికీ చివరి వరకు ఎవరూ హాజరుకాలేదని తెలుస్తోంది. దీంతో తెలంగాణ అధికారులు కొంతసేపు వేచి చూసిన అనంతరం తదుపరి చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అక్రమ తవ్వకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా పికెటింగ్ ఏర్పాటు చేశారు. తెలంగాణ భూభాగంలో ఎవరైనా అనుమతి లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు హెచ్చరించినట్లు తెలిసింది. రాత్రి వేళల్లో కూడా తవ్వకాలు జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఈ పరిణామంతో జాయింట్ సర్వేకు కొత్త తేదీ ఎప్పుడు నిర్ణయిస్తారు? మహారాష్ట్ర అధికారులు తదుపరి సమావేశానికి హాజరవుతారా? సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాలపై రెండు రాష్ట్రాల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు మాత్రం రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని జాయింట్ సర్వేను త్వరితగతిన నిర్వహించాలని కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more