బోధన్ నియోజకవర్గ స్థాయి సభ విజయవంతం – సంక్షేమ పథకాలపై అవగాహన..

నిజామాబాద్, మే 2: అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోధన్ పట్టణంలోని ఆచన్‌పల్లిలోని ఏఆర్ గార్డెన్‌లో నిర్వహించిన బోధన్ నియోజకవర్గ స్థాయి సభలో కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపించారు. పంట రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి, చేయూత పథకం, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, సన్నధాన్యానికి బోనస్ చెల్లింపు తదితర పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను వెల్లడించారు. పలువురు లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజల అభిప్రాయాలను సేకరించి సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించేందుకు, సమస్యల పరిష్కారానికి ఇటువంటి సభలు దోహదపడతాయని తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతున్నామని, ఇంకా అర్హులు మిగిలి ఉంటే మున్సిపల్, ఎంపీడీఓ కార్యాలయాల్లోని ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని, నిర్మాణ దశలను స్వయంగా సెల్ఫీ ఫోటోల ద్వారా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసుకునే సౌకర్యం కల్పించామని గుర్తు చేశారు. త్వరలోనే రెండో విడతలో మరిన్ని ఇళ్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు.
అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, అంగన్వాడీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహార పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు వివరించారు. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, బోధన్ శివారు బెల్లాల్‌లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన జరిగిందని తెలిపారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం, మొక్కజొన్న సేకరణ జరుగుతోందని, ఇటీవల విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు.
వేసవి కాలంలో తాగునీటి సరఫరాపై ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగుతోందని, జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇసుక అవసరమున్న వారు ఆన్‌లైన్ బుకింగ్ విధానాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ, పట్టణంలోని అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సహకారం అందిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ద్వారా కమిషన్ రూపంలో వచ్చిన రూ.3.80 కోట్ల చెక్కును మహిళా సంఘాలకు పంపిణీ చేశారు. ఐసీడీఎస్ ద్వారా 100 అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులకు సెల్‌ఫోన్లు అందజేశారు. ముగ్గురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సభలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, డీడబ్ల్యూఓ పద్మ, ఏసీసి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832






