Post Views: 151
ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ ఆదేశాలు అమలు ఎక్కడ?
పోలీస్ కనుసన్నల్లోనే కొనసాగుతున్న ఇసుక దందా
“ఉదయం 10 వరకు ఫ్రీ రూట్” అంటూ మాఫియా బహిరంగ ప్రకటన
సరిహద్దుల నుంచి చెక్‌పోస్టుల వరకూ నియంత్రణ లేకపోవడంపై విమర్శలు
ధాబాలు మాఫియాకు అడ్డాగా మారాయన్న ఆరోపణలు
నిర్మాణదారులపై దోపిడీ… ప్రజల ప్రాణాలతో ఆట..
బోధన్: జిల్లాలో అక్రమ ఇసుక రవాణా మళ్లీ బహిరంగంగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంజీరా పరివాహక ప్రాంతంలోని సాలూర మండలం మందర్న గ్రామం నుంచి ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య ట్రాక్టర్లు, టిప్పర్లు, ట్రాలీ ఆటోల ద్వారా అనుమతులు లేకుండా ఇసుక తరలింపులు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.
ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వంటి ఉన్నతాధికారులు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, అవి స్థానిక స్థాయిలో అమలు కావడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణ, రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కొందరు సిబ్బంది నిర్లక్ష్యం లేదా సహకారంతో ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇసుక కొరతను అవకాశంగా మార్చుకున్న అక్రమార్కులు “పోలీస్ సపోర్ట్ ఉంది… ఉదయం 10 వరకు ఎలాంటి అడ్డంకులు ఉండవు” అంటూ వాహన యజమానులే చెప్పుకుంటున్నారన్న ప్రచారం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.
అనుమతులు లేకుండా ఇసుక తరలించే వాహనాలు అధిక వేగంతో రోడ్లపై దూసుకుపోవడంతో ప్రమాదాల ముప్పు పెరుగుతోంది. సాధారణ ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు.
మహారాష్ట్ర సరిహద్దుల నుంచి చెక్‌పోస్టుల ద్వారా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇసుక వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. చెక్‌పోస్టుల నుంచే వాహనాలు దాటిపోవడం నియంత్రణలో లోపాలకు నిదర్శనంగా భావిస్తున్నారు.
ఇక రాత్రివేళల్లో కొన్ని ధాబాలు ఇసుక మాఫియాకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడే సమావేశాలు, లావాదేవీలు జరుగుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇసుక కొరతను ఆసరాగా చేసుకుని నిర్మాణదారులను అక్రమార్కులు అధిక ధరలకు ఇసుక అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుత విధానాలను పునఃసమీక్షించి, సరళమైన విధానంలో ఇసుక సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఇంత జరుగుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించకపోవడం పలు ప్రశ్నలకు తావిస్తోంది.
అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక మాఫియాకు మౌన మద్దతే కొనసాగుతుందా? అన్నది ప్రజల ఆవేదన.
🔴
“నియంత్రణలో వైఫల్యం… బాధ్యత ఎవరిది?”
అక్రమ ఇసుక రవాణా కేవలం ఆదాయ నష్టం మాత్రమే కాదు – ప్రజల ప్రాణాలకు ముప్పు. అధికారుల ఆదేశాలు నేలమీద అమలుకాకపోతే, వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. వెంటనే సమగ్ర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832











