### బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం.. ఘనంగా వర్ధంతి నివాళులు
బోధన్, నవంబర్ 28:
బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సామాజిక సమానత్వం, విద్యా వికాసం కోసం తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని బోధన్ పట్టణంలోని చెక్కి క్యాంపు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అమలు యూనియన్ అధ్యక్షుడు కనిగంటి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే సమాజంలో నెలకొన్న కుల, సామాజిక అసమానతలను తొలగించేందుకు జీవితాంతం పోరాటం చేశారని కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు విద్య అందుబాటులోకి తీసుకురావడంతో పాటు మహిళా విద్య, సామాజిక సంస్కరణలకు ఆయన విశేష కృషి చేశారని పేర్కొన్నారు.
మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవిత భాగస్వామి సావిత్రిబాయి పూలేతో కలిసి మహిళా విద్యకు పునాదులు వేశారు. బాలికలకు విద్య అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి, సమాజంలో విద్య ద్వారానే సమానత్వం సాధ్యమవుతుందని చాటిచెప్పారు. కుల వివక్ష, అంటరానితనం, మూఢనమ్మకాలపై పోరాడుతూ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేశారని గుర్తుచేశారు.
పూలే ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, విద్య, సమానత్వం, సామాజిక న్యాయం దిశగా ముందుకు సాగాలని కనిగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అమలు యూనియన్ అధ్యక్షుడు కనిగంటి శ్రీనివాస్‌తో పాటు పలువురు నాయకులు, విద్యార్థులు, చిన్నారులు, గ్రామస్తులు పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలేకు ఘన నివాళులర్పించారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







