బోధన్ బస్తీ దవాఖానలో సాలూరా, పెగడపల్లి, బోధన్ అర్బన్ ఆశా కార్యకర్తలకు సమగ్ర శిక్షణ…
బోధన్: ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ టీమ్ (PODTT) డా. అంజనా సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క్షేత్రస్థాయిలో ఆశా కార్యకర్తలు మరింత చురుకుగా పనిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
బోధన్ బస్తీ దవాఖానలో ఆదివారం సాలూరా, పెగడపల్లి, బోధన్ అర్బన్ ప్రాంతాలకు చెందిన ఆశా కార్యకర్తలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. అంజనా సమావేశానికి నాయకత్వం వహిస్తూ ఆశా కార్యకర్తలకు ఆశా సపోర్టివ్ సూపర్విజన్తో పాటు వివిధ ప్రజారోగ్య కార్యక్రమాలపై సమగ్ర శిక్షణ అందించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో మాతా శిశు ఆరోగ్యం (MCH), వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం (Immunization), లింఫాటిక్ ఫైలేరియాసిస్ నిర్మూలన కార్యక్రమం (LCDC), అసంక్రమిత వ్యాధుల నివారణ, నియంత్రణ (NCD), కాలానుగుణంగా ప్రబలే వ్యాధులు, వాటి నివారణ చర్యలపై వివరంగా అవగాహన కల్పించారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే ప్రాథమిక ఆరోగ్య సేవలను సమర్థవంతంగా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
ప్రతి గర్భిణీని ముందుగానే గుర్తించి, గర్భధారణ ప్రారంభ దశలోనే ఏఎన్సీ (ANC) నమోదు చేయించాలని, నిర్ణీత సమయాల్లో ఆరోగ్య పరీక్షలు, అవసరమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణులకు పౌష్టికాహారం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రల వినియోగం, ఆసుపత్రిలో ప్రసవం, ప్రసవానంతర సంరక్షణపై అవగాహన కల్పించాలని తెలిపారు. తల్లి, బిడ్డ ఆరోగ్య పరిరక్షణకు నిరంతర పర్యవేక్షణ ఎంతో అవసరమని పేర్కొన్నారు.
వ్యాధుల నివారణే ప్రధాన లక్ష్యం..
చిన్నారులకు నిర్ణీత షెడ్యూల్ ప్రకారం అన్ని టీకాలు అందేలా చూడాలని, టీకాల ప్రాధాన్యతను తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. అదేవిధంగా డెంగ్యూ, మలేరియా వంటి కాలానుగుణ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ పరిసరాల పరిశుభ్రత, నిల్వ నీరు లేకుండా చూడటం, దోమల నివారణ చర్యలపై అవగాహన కల్పించాలన్నారు.
మధుమేహం, రక్తపోటు వంటి అసంక్రమిత వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రజలను ఆరోగ్య పరీక్షలకు ప్రోత్సహించాలని, అవసరమైన వారికి వైద్య సేవలు అందేలా సంబంధిత ఆరోగ్య కేంద్రాలకు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు.
ఆశా కార్యకర్తలు కేవలం ఆరోగ్య సేవల సమాచారాన్ని అందించేవారిగానే కాకుండా, ప్రజలకు ఆరోగ్య వ్యవస్థకు మధ్య వారధిగా నిలవాలని, ప్రతి ఇంటికీ ఆరోగ్య అవగాహన చేరవేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా శిక్షణ బృందం (PODTT) సభ్యులు, బోధన్ DYDM&HO, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








