### ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌కు పోలీసుల అభినందనలు. సకాలంలో స్పందించిన బోధన్ పోలీసుల సేవలు ప్రశంసనీయం…..
బోధన్, నవంబర్ 5 (V1 న్యూస్): ప్రయాణంలో పోగొట్టుకున్న రూ.87 వేల నగదును ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ చొరవతో తిరిగి పొందిన ఘటన బోధన్‌లో చోటుచేసుకుంది. నిజాయితీతో వ్యవహరించిన ఆర్టీసీ సిబ్బంది, సకాలంలో స్పందించిన బోధన్ పోలీసుల సేవలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి.

నిజామాబాద్‌కు చెందిన సంధ్య అనే మహిళ గురువారం బోధన్‌లోని బ్యాంకులో రూ.87 వేల నగదు జమ చేసేందుకు బస్సులో బయలుదేరారు. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో షక్కర్‌నగర్ వద్ద బస్సు దిగిన ఆమె, నగదు ఉన్న కవర్‌ను తాను కూర్చున్న సీటుపై మరిచిపోయి వెళ్లిపోయారు.
కొద్దిసేపటికే నగదు కవర్ మరిచిపోయిన విషయాన్ని గుర్తించిన సంధ్య వెంటనే బోధన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుపై స్పందించిన బోధన్ పోలీసులు, దేగ్లూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును గుర్తించి, డ్రైవర్ సలీం, కండక్టర్ హనుమాన్ సహకారంతో బస్సులో తనిఖీ చేయించారు.
ఈ తనిఖీల్లో సీటుపై మరిచిపోయిన రూ.87 వేల నగదు కవర్ లభించింది. దీంతో డ్రైవర్, కండక్టర్ ఆ నగదును భద్రంగా బాధితురాలు సంధ్యకు తిరిగి అందజేశారు. పోగొట్టుకున్న నగదు తిరిగి లభించడంతో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
### నిజాయితీకి మారుపేరుగా ఆర్టీసీ సిబ్బంది…
ప్రయాణికురాలు మరిచిపోయిన నగదును సొంతం చేసుకోకుండా బాధ్యతగా వ్యవహరించి తిరిగి అప్పగించిన డ్రైవర్ సలీం, కండక్టర్ హనుమాన్ నిజాయితీని పలువురు అభినందిస్తున్నారు. విధి నిర్వహణలో ప్రయాణికుల పట్ల బాధ్యతతో వ్యవహరించడం, ప్రజల ఆస్తులకు భద్రత కల్పించడం అభినందనీయమని పేర్కొంటున్నారు.
అదేవిధంగా బాధితురాలి ఫిర్యాదుపై వెంటనే స్పందించి, బస్సును గుర్తించి నగదు తిరిగి అందేలా చర్యలు తీసుకున్న బోధన్ పట్టణ పోలీసుల సేవలు ప్రశంసనీయం. ఈ సందర్భంగా బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణ నేతృత్వంలో పోలీసుల స్పందన, ప్రజలకు అందిస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.
నిజాయితీ, బాధ్యత, సమయస్ఫూర్తి కలిస్తే ప్రజలకు భరోసా లభిస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది…
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








