రద్దీ ప్రాంతాల్లో జేబు దొంగల పట్ల జాగ్రత్త.. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
బోధన్, నవంబర్ 2 (వి1 న్యూస్): బోధన్ పట్టణంలోని ప్రధాన మార్కెట్‌కు వచ్చే ప్రజలు తమ వ్యక్తిగత వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పట్టణ పోలీసులు సూచించారు. రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్లు, నగదు, ఇతర విలువైన వస్తువుల చోరీలకు ఆస్కారం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీస్ కమిషనర్ పి. సాయిచైతన్య, టౌన్ ఎస్‌హెచ్‌ఓ వెంకటనారాయణ ఆదేశాల మేరకు, ఎస్‌ఐలు హబీబ్ ఖాన్, రాజుల పర్యవేక్షణలో పట్టణ పోలీసు సిబ్బంది ఆదివారం ప్రధాన మార్కెట్ ప్రాంతంలో పర్యటించారు. ‘మన ఊరు–మన భద్రత’ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ మైక్ ద్వారా పలు సూచనలు చేశారు.
మార్కెట్‌లో కొనుగోళ్ల సమయంలో సెల్‌ఫోన్లు, పర్సులు, నగదు వంటి విలువైన వస్తువులను జాగ్రత్తగా భద్రపరచుకోవాలని ఎస్‌ఐలు సూచించారు. రద్దీని ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, అపరిచితుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు.
అనుమానం వస్తే వెంటనే సమాచారం ఇవ్వండి
మార్కెట్ ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, దొంగతనం జరిగినా వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మార్కెట్ ప్రాంతాల్లో వాహనాలను క్రమబద్ధంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరికీ వెల్లడించవద్దని సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
ప్రజల సహకారంతోనే శాంతిభద్రతలను సమర్థంగా కాపాడగలమని పోలీసులు పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు మార్కెట్‌కు వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”









