స్కైరూట్ ఏరోస్పేస్ సాంకేతిక బృందంలో సభ్యత్వం.. నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు
కోటగిరి, జూలై 22 (వి1 న్యూస్):
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో మైలురాయిగా నిలిచిన విక్రమ్-1 రాకెట్ రూపకల్పనలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలానికి చెందిన యువ ఇంజనీర్ మహాజన్ అఖిల్ సాంకేతిక బృందంలో సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి దేశ అంతరిక్ష రంగంలో తన ప్రతిభను చాటుకోవడం ద్వారా జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయికి చాటిచెప్పారు.
కోటగిరి మండల కేంద్రానికి చెందిన స్వర్గీయ మహాజన్ విఠల్ కుమారుడైన అఖిల్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు రూపొందించిన విక్రమ్-1 రాకెట్ తయారీ, ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక ప్రక్రియల్లో ఆయన తన సేవలను అందించారు.

అఖిల్ పవర్ ఎలక్ట్రానిక్స్‌లో ఎం.టెక్ పూర్తి చేశారు. అనంతరం సుమారు ఆరు సంవత్సరాల పాటు డీఆర్‌డీఓలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. రక్షణ రంగంలో పొందిన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రస్తుతం అంతరిక్ష పరిశోధనల్లో వినియోగిస్తూ దేశ ప్రైవేట్ స్పేస్ రంగ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
విక్రమ్-1 ప్రాజెక్టులో భాగస్వామ్యం కావడం ద్వారా అఖిల్ ప్రతిభ మరోసారి వెలుగులోకి వచ్చింది. భారత ప్రైవేట్ అంతరిక్ష రంగానికి ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలకు నాంది పలుకుతుండగా, కోటగిరి వంటి గ్రామీణ ప్రాంతానికి చెందిన యువకుడు ఈ విజయ ప్రస్థానంలో భాగస్వామి కావడం జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
పట్టుదల, కృషి, లక్ష్యసాధన ఉంటే గ్రామీణ ప్రాంతాల యువత కూడా దేశ అత్యున్నత సాంకేతిక రంగాల్లో రాణించగలరనే విషయాన్ని అఖిల్ తన విజయంతో నిరూపించారు. ఆయన సాధించిన ఘనత పట్ల కోటగిరి ప్రజలు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రం, దేశానికి మరింత పేరు తీసుకురావాలని స్థానిక ప్రజాప్రతినిధులు, యువత ఆకాంక్షిస్తున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







