విద్యార్థినులతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్న ఆర్డీఓ – నాణ్యమైన వసతులు కల్పించాలని వార్డెన్లకు ఆదేశం
బోధన్, జూలై 21 (వి1 న్యూస్):
బోధన్ రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) మంగళవారం సాయంత్రం రాకాసిపేటలోని ఎస్సీడీడీ (SCDD) బాలికల కళాశాల హాస్టల్, బాలికల పాఠశాల హాస్టల్లను బోధన్ తహసీల్దార్‌తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా స్టడీ హాల్, వంటశాల (కిచెన్), డైనింగ్ హాల్, విద్యార్థినుల గదులు, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్, రీడింగ్ రూమ్, లైబ్రరీ, ప్రాంగణం, ఆటల వసతులను పరిశీలించారు. హాస్టల్లో నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు, కూరగాయల నాణ్యత, వండిన ఆహారం, ఫ్యాన్లు, లైట్లు తదితర సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం విద్యార్థినులతో నేరుగా మాట్లాడిన ఆర్డీఓ వారి విద్యాభ్యాసం, చదువుతున్న పాఠాలు, సాధిస్తున్న మార్కులు, హాస్టల్లో ఎదురవుతున్న సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ప్రోత్సహించారు.
ఈ సందర్భంగా ఓ ప్రాథమిక పాఠశాల విద్యార్థినిని “ఇంటి వద్ద బాగుంటుందా.. హాస్టల్లో బాగుంటుందా?” అని ప్రశ్నించగా, “హాస్టల్లోనే బాగుంది” అని చిరునవ్వుతో సమాధానం ఇవ్వడంతో ఆర్డీఓ, తహసీల్దార్, హాస్టల్ వార్డెన్లు ఆనందం వ్యక్తం చేశారు.
హాస్టల్ వార్డెన్లతో సమావేశమైన ఆర్డీఓ, విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులు, పరిశుభ్రత, పోషకాహారం, భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీ తత్వం, మానసిక ఆరోగ్య వికాసానికి దోహదపడే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు.
హాస్టళ్లలో గుర్తించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత వార్డెన్లకు ఆర్డీఓ సూచించారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







