బాత్రూమ్లు, ప్రహరీ గోడ, తాగునీరు, పరిశుభ్రత వంటి సమస్యలపై ఆందోళన – పాఠశాలను సందర్శించిన జిల్లా కమిటీ
బోధన్, జూలై 20 (వి1 న్యూస్):
బోధన్ పట్టణంలోని మధు మలంచ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాల మేరకు జిల్లా కమిటీ సోమవారం పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది.

పాఠశాలలో సుమారు 260 మంది విద్యార్థులు చదువుతున్నప్పటికీ, బాలికలు, బాలురు, ఉపాధ్యాయులకు సరిపడా మరుగుదొడ్లు లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని కమిటీ పేర్కొంది. విద్యార్థుల ప్రాథమిక అవసరాలకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపింది.
పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడం, వర్షపు నీరు ఆవరణలో నిల్వ ఉండడం, తాగునీటి సౌకర్యం తగినంతగా లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి సమస్యలు ఉన్నాయని కమిటీ వివరించింది. 260 మంది విద్యార్థులకు రోజూ కేవలం 20 లీటర్ల సామర్థ్యం గల ఆరు మినరల్ వాటర్ క్యాన్లు మాత్రమే అందించడం సరిపోవడం లేదని పేర్కొంది.
కొన్ని సందర్భాల్లో విద్యార్థులు తరగతి గదుల నుంచి బయటకు వచ్చి రోడ్లపై తిరుగుతున్న పరిస్థితులు కనిపించాయని, పాఠశాల చుట్టూ ముండ్ల పొదలు, చెత్త, మురుగు పేరుకుపోయి దుర్వాసన వెదజల్లడంతో విద్యార్థుల ఆరోగ్యానికి ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. చికెన్, మటన్ వ్యాపారాలకు సంబంధించిన వ్యర్థాలను పాఠశాల పరిసరాల్లో పడేస్తుండడం కూడా తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించింది.
ఈ సమస్యలు చాలా కాలంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు సమగ్ర చర్యలు చేపట్టలేదని తెలంగాణ రక్షణ సేన ఆరోపించింది.
తెలంగాణ రక్షణ సేన డిమాండ్లు
- బాలికలు, బాలురు, ఉపాధ్యాయులకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించాలి.
- పాఠశాలకు ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలి.
- తగిన తాగునీటి సౌకర్యం కల్పించాలి.
- పాఠశాల పరిసరాల్లోని చెత్త, మురుగు, ముండ్ల పొదలను తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలి.
- చికెన్, మటన్ వ్యర్థాలను పాఠశాల సమీపంలో పడేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.
- అవసరమైన అన్ని మౌలిక వసతులను యుద్ధప్రాతిపదికన కల్పించి విద్యార్థులకు సురక్షితమైన, పరిశుభ్రమైన విద్యా వాతావరణం అందించాలని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నిజామాబాద్ జిల్లా కమిటీ సభ్యులు, ఆర్మూర్ ఇన్చార్జి నవీన్ రెడ్డి, బోధన్ నాయకులు రజాక్, దొంత ప్రవీణ్ కుమార్, శేఖర్ రాజు, ఇరుముల శంకర్, శ్రీనివాస్ గౌడ్, రాఘవేందర్, సన్నీ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







