సకాలంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు – మూడు రోజుల పాటు నిరంతర ఆధ్యాత్మిక మహోత్సవం
V1 న్యూస్, బోధన్ | జూలై 20:
బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లిలో ఉన్న శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సోమవారం నుంచి ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. “ఓం నమఃశివాయ” నామస్మరణ, వేద మంత్రోచ్ఛారణల మధ్య ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, రుద్రపారాయణం, మహామంగళహారతులు, విశేష పూజలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు.
రాష్ట్రంలో, దేశంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడిపంటలతో సుభిక్షంగా జీవించాలని సంకల్పిస్తూ ఈ మహోత్సవాన్ని బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ మరియు వీడీసీ పట్టణ అభివృద్ధి కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక రుద్రాభిషేకాలు, రుద్రపారాయణం, శివారాధన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

మూడు రోజుల పాటు నిరంతరాయంగా అఖండ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణ, వేదఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా వీడీసీ పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ బుజ్జి శంకర్, కోశాధికారి శ్రీను, బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు వినోద్ పట్వారి, ప్రధాన కార్యదర్శి ఉమానందు వైద్యతో పాటు కమిటీ సభ్యులు మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ పవిత్ర అఖండ రుద్రాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని నిర్వాహకులు భక్తులకు విజ్ఞప్తి చేశారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







