“నేరానికి అడ్డుకట్ట వేయకపోతే… నేరస్థుడి ధైర్యమే పెరుగుతుంది!”
సాలూర, ప్రతినిధి:
సాలూర మండలంలోని హుంసా, మందర్ణ, హెగడోల్లి గ్రామాల శివార్లు, మంజీరా పరివాహక ప్రాంతాలు, తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, పంట పొలాలు, మామిడి తోటలు, అరటి తోటలు, అడవి ప్రాంతాలు ప్రస్తుతం పేకాట మాఫియాకు అడ్డాలుగా మారినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు హుంసా గ్రామానికి చెందిన పేకాట నిర్వాహకులు, మరికొందరు సాలూర గ్రామానికి చెందిన వ్యక్తులతో చేతులు కలిపి రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకుని ప్రతిరోజూ లక్షల రూపాయలతో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

పోలీసులకు సైతం అంతుచిక్కకుండా రోజూ మకాంలు మారుస్తూ,
ఒకరోజు హుంసా పంట పొలాల్లో, మరొకరోజు మందర్ణ మామిడి తోటల్లో, ఇంకోరోజు మంజీరా పరివాహక ప్రాంతాల్లో, మరుసటి రోజు తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో, అలాగే హెగడోల్లి గ్రామ శివార్లలోని పొదలు, వ్యవసాయ భూముల్లో స్థావరాలు మార్చుకుంటూ అధికారుల కళ్లుగప్పి పేకాట నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్థానికుల సమాచారం ప్రకారం, మామిడి తోటలు, అరటి తోటలు, పంట పొలాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్లు, అలాగే వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించిన గెస్ట్ హౌస్‌లను సైతం జూద స్థావరాలుగా వినియోగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. స్థావరాలు తరచూ మారుస్తుండటంతో వాటిని గుర్తించడం అధికారులకు సవాలుగా మారిందని స్థానికులు చెబుతున్నారు.

అంతేకాకుండా సాలూర గ్రామ శివార్లలోని ఓ పాడుబడిన గెస్ట్ హౌస్‌ను కూడా జూద కేంద్రంగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అక్కడ ‘కవరింగ్ బాయ్’లను ఏర్పాటు చేసి, పోలీసుల కదలికలపై నిఘా ఉంచుతూ, రోజువారీ కూలీలను చెల్లించి బయటి వ్యక్తులను అప్రమత్తం చేసే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
జూదానికి వచ్చే వారికి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించడమే కాకుండా, డబ్బులు లేని వారికి అధిక వడ్డీకి నగదు అప్పుగా ఇచ్చి, వారి ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను తాకట్టు పెట్టించి జూదానికి బానిసలుగా మారుస్తున్నట్లు సమాచారం. ఈ అక్రమ వ్యవహారంలో మండలానికి చెందిన కొందరు బడాబాబులు కూడా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.
గతంలో పేకాట కేసుల్లో పట్టుబడిన కొందరే మళ్లీ ఈ ర్యాకెట్‌ను నడుపుతున్నట్లు సమాచారం. దీంతో యువత, రైతులు, కూలీలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ కథనంలో పేర్కొన్న అంశాలు జూదానికి బానిసైన కొందరు వ్యక్తులు, జూదంలో ఆర్థికంగా దెబ్బతిన్న బాధితులు, అలాగే స్థానికులు అందించిన సమాచారం ఆధారంగా ప్రజల దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువస్తున్నవి. ఈ ఆరోపణలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, టాస్క్‌ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీసి, అక్రమంగా పేకాట నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







