కందకుర్తి నుంచి బోధన్‌కు ప్రత్యేక బస్సులు నడపాలి: టీజీవీపీ…
బోధన్, నవంబర్ 2: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు విద్యాసంస్థలకు సకాలంలో చేరుకునేలా ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు ఆర్టీసీ అధికారులను కోరారు. ఈ మేరకు టీజీవీపీ బోధన్ డివిజన్ కార్యదర్శి మదరోళ్ల నిఖిల్ సోమవారం బోధన్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు.

కందకుర్తి, పేపర్ మిల్, నీలా, సాటాపూర్ గ్రామాల నుంచి బోధన్ పట్టణంలోని పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ప్రతిరోజూ బస్సుల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిఖిల్ తెలిపారు. సమయానికి బస్సులు అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు విద్యాసంస్థలకు ఆలస్యంగా చేరుకుంటున్నారని పేర్కొన్నారు.
విద్యార్థుల సమస్యను దృష్టిలో ఉంచుకుని ఉదయం 8:30 గంటలకు కందకుర్తి నుంచి బోధన్‌కు, సాయంత్రం 4:30 గంటలకు బోధన్ నుంచి కందకుర్తికి ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని కోరారు. ఈ సర్వీసుల ద్వారా ఆయా గ్రామాల విద్యార్థులకు రవాణా సమస్యలు తగ్గి, తరగతులకు సకాలంలో హాజరయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రత్యేక బస్సు సర్వీసులను ప్రారంభించాలని టీజీవీపీ నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో టీజీవీపీ సభ్యులు అర్ఫత్ ఖాన్, షేక్ ఖాజా మొయినుద్దీన్, విద్యార్థులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







