భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలి
– ప్రత్యేక అధికారి హనుమంతరావు
కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్‌తో కలిసి సందర్శించి పనులపై సమీక్ష
బోధన్, అక్టోబర్ 23 : గోదావరి పుష్కరాల పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ప్రత్యేక అధికారి, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కందకుర్తి పుష్కర ఘాట్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ భుజంగరావుతో కలిసి ఆయన సందర్శించారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు పలు సూచనలు చే
దేవాదాయ, నీటిపారుదల, రోడ్లు–భవనాలు (ఆర్ అండ్ బీ), పంచాయతీరాజ్ తదితర శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. నిర్మాణ పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగంగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పుణ్యస్నానాల కోసం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని సదుపాయాలను ముందుగానే అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఆలయాల అభివృద్ధి, నవీకరణ, నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులు, రహదారుల నిర్మాణం, తాగునీటి వసతి, పార్కింగ్, వీఐపీ ఘాట్ నిర్మాణం తదితర పనులను సమీక్షించారు. గత పుష్కరాల సమయంలో ఎదురైన సమస్యలను గుర్తించి, ఈసారి అవి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని హనుమంతరావు ఆదేశించారు. పుష్కర ఘాట్లకు ఇరువైపులా ర్యాంపులు నిర్మించాలని, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వాచ్టవర్లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని సూచించారు.
మార్చి నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేస్తాం: కలెక్టర్…
కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, జిల్లాలోని కందకుర్తి, యంచ తదితర గోదావరి పరీవాహక పుణ్యక్షేత్రాల్లో పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించిన పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్న కందకుర్తి పుణ్యక్షేత్రంలో పనుల పురోగతిని క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
కందకుర్తి వద్ద గోదావరిలో ప్రస్తుతం నీటి ప్రవాహం ఉన్నందున నూతన పుష్కర ఘాట్ నిర్మాణానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని కలెక్టర్ వివరించారు. నీటిమట్టం తగ్గిన తర్వాత ఘాట్ నిర్మాణ పనులు చేపట్టి రెండు నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. మిగిలిన పనులను వెంటనే చేపట్టి, నిర్ణయించిన మైలురాళ్లకు అనుగుణంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి అన్ని పనులు పూర్తయ్యేలా స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.
ఈ పర్యటనలో బోధన్ ఆర్డీఓ విజయకుమారి, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, నీటిపారుదల, దేవాదాయ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








