భీముని మందిరంలో మహా యజ్ఞం.. శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు – బంగారం ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు…
బోధన్, అక్టోబర్ 20: బోధన్ పట్టణంలో విజయదశమి (దసరా) పండుగ వేడుకలు మంగళవారం భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. గ్రామ పెద్దలు గంగాధర్ రావు పట్వారి, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి, ఆమె భర్త శరత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని భీముని మందిరం వద్ద ఆనవాయితీగా మహా యజ్ఞాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా శమీ వృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని భీముని మందిరానికి పట్టణ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి, భీముని మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయానికి ప్రతీకగా భావించే బంగారాన్ని (జమ్మి ఆకులను) ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
పండుగ సందర్భంగా భీముని మందిరం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏటా నిర్వహించే ఈ సంప్రదాయ వేడుకలు పట్టణంలో భక్తిభావాన్ని, సోదరభావాన్ని, సామాజిక ఐక్యతను చాటిచెప్పాయి.
ఈ పూజా కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మారుతీ మందిరం ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, పట్టణ ప్రముఖులు, ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








