మంగళహారతులు.. భక్తుల కోలాహలం.. నృత్యాలతో మార్మోగిన పురవీధులు…

బోధన్, అక్టోబర్ 21: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో దుర్గాదేవి అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర బుధవారం భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గ్రామ సర్పంచ్ శీలం నర్మద సంతోష్ రెడ్డి, మండప నిర్వాహకులు, అమ్మవారి మాలధారులు, గ్రామ పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు.
అమ్మవారి ఉత్సవ విగ్రహంతో ప్రారంభమైన శోభాయాత్ర గ్రామంలోని ప్రధాన పురవీధుల గుండా సాగింది. అడుగడుగునా భక్తులు అమ్మవారికి నీరాజనాలు పలుకుతూ భక్తిని చాటుకున్నారు. గ్రామ మహిళలు మంగళహారతులతో అమ్మవారికి స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ శోభాయాత్రలో పాల్గొనడంతో గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొంది.

గ్రామ సుభిక్షం కోసం అమ్మవారికి ప్రత్యేక ప్రార్థనలు…
దుర్గాదేవి అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, పిల్లాపాపలు చల్లగా ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. భక్తుల జయజయధ్వానాలు, పూజలు, మంగళహారతుల మధ్య శోభాయాత్ర భక్తిమయంగా కొనసాగింది.
గ్రామంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని మరింత బలోపేతం చేస్తాయని గ్రామస్తులు పేర్కొన్నారు. భక్తులందరూ సమష్టిగా పాల్గొనడంతో అమ్మవారి నిమజ్జన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య సాగాయి.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శీలం నర్మద సంతోష్ రెడ్డి, గ్రామ పెద్ద శీలం సంతోష్ రెడ్డి, బోధన్ మాజీ ఎంపీపీ గైని పెద్ద గంగారం, మండప నిర్వాహకులు, అమ్మవారి మాలధారులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువతీ యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







