-- --

నేరాలపై ఉక్కుపాదం.. అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

నేరాలపై ఉక్కుపాదం..

అక్రమ కార్యకలాపాలపై నిరంతర దాడులు

డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు..అవసరమైతే పీడీ యాక్ట్

రాబోయే పండుగలకు పటిష్ట బందోబస్తు..

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ

నిజామాబాద్, సెప్టెంబర్ 9 (వి.1 న్యూస్):
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ, పెండింగ్ కేసుల పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ, సీసీఆర్‌బీ ఏసీపీ, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

 


రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు డ్రగ్స్‌, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక దాడులు కొనసాగించాలని సీపీ అధికారులను ఆదేశించారు. అక్రమ రవాణా, విక్రయాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు. పేకాట, గుట్కా, ఇసుక తదితర అక్రమ వ్యాపారాలపై కూడా నిరంతర దాడులు నిర్వహించాలని ఆదేశించారు.

సైబర్ నేరాలపై అప్రమత్తత
సైబర్ నేరాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. ఆన్‌లైన్ మోసాలకు గురైన బాధితులకు పోలీసులు తక్షణమే స్పందించి సహాయం అందించాలని తెలిపారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, రెచ్చగొట్టే పోస్టులు చేసే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించాలి
హత్య, హత్యాయత్నం, చోరీలు, మహిళలపై నేరాలు, సైబర్ మోసాలు, డ్రగ్స్‌, గంజాయి అక్రమ రవాణా తదితర కేసుల పురోగతిని సీపీ సమీక్షించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రౌడీషీటర్లు, పాత నేరస్థులు, బెయిల్‌పై విడుదలైన నిందితుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. రాత్రి పహారా వ్యవస్థను మరింత బలోపేతం చేసి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు.

మహిళల భద్రతకు ప్రాధాన్యం
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీపీ స్పష్టం చేశారు. షీ టీమ్స్‌, ఈగల్ టీమ్స్‌, చీతా ఫోర్స్ బృందాలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. విద్యాసంస్థలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీపీ అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి అవసరమైన సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. హైవేలను కలుపుతున్న లింక్‌ రోడ్ల వద్ద అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లకు అడ్డుగా ఉన్న పొదలను తొలగించేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు.

రోడ్డు ఇంజినీరింగ్ లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నేషనల్ హైవే, స్టేట్ హైవే అధికారులతో సమన్వయంతో ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రతిరోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని, ఓవర్‌స్పీడ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, మైనర్లు వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.

పండుగల నేపథ్యంలో 24/7 తనిఖీలు
రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సీపీ సూచించారు. వాహనాల తనిఖీలను 24 గంటలూ కొనసాగించాలని, తనిఖీల సమయంలో సిబ్బంది ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని స్పష్టం చేశారు.

డయల్‌ 112పై విస్తృత ప్రచారం
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వినియోగించుకునే డయల్‌ 112 సేవపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సీపీ సూచించారు. ఈ సమాచారం ప్రతి ఒక్కరికీ చేరేలా పోలీసులు నిరంతరం ప్రచారం నిర్వహించాలని తెలిపారు.

పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. రిసెప్షన్‌ నిర్వహణ, రికార్డుల నిర్వహణ, స్టేషన్‌ పరిశుభ్రత, సిబ్బంది క్రమశిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిర్లక్ష్యాన్ని సహించబోమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా ప్రతి పోలీసు అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని సీపీ పి. సాయి చైతన్య సూచించారు.

ఈ సమావేశంలో నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్ యాదవ్, సీసీఆర్‌బీ ఏసీపీ గురునాయుడు, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలు, ఐటీ కోర్‌ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more