-- --

సరిహద్దుల్లో సేవ.. స్వగ్రామంలో ఘన సన్మానం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

దేశ సేవలో సైనికుల త్యాగాలు ఆదర్శనీయం: సర్పంచ్ ఉదయ్ భాస్కర్
బాల్యమిత్రుడైన ఆర్మీ జవాన్ గొడుగు గంగాధర్‌కు ఘన సత్కారం
పోతంగల్, ఆగస్టు 22
“దేశం కోసం పనిచేసే చేతులకు గౌరవం దక్కితే.. దేశభక్తికి మరింత బలం చేకూరుతుంది” అన్న నానుడికి నిదర్శనంగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్మీ జవాన్ గొడుగు గంగాధర్‌కు స్వగ్రామమైన హంగర్గలో శనివారం ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక సర్పంచ్ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, యువకులు, ప్రజాప్రతినిధులు జవాన్‌కు ఆత్మీయ స్వాగతం పలికి పూలమాలలు, శాలువాతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం కుటుంబాలకు దూరంగా ఉంటూ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల సేవలు, త్యాగాలు అభినందనీయమన్నారు. దేశ భద్రత కోసం సైనికులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు.

తన చిన్ననాటి స్నేహితుడైన గంగాధర్‌తో కలిసి ఒకే పాఠశాలలో చదువుకున్న రోజులను, ఆటపాటల జ్ఞాపకాలను సర్పంచ్ గుర్తుచేసుకున్నారు. బాల్యమిత్రుడు దేశ సేవలో భాగంగా సరిహద్దుల్లో విధులు నిర్వహించి స్వగ్రామానికి రావడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సైనికులు సరిహద్దుల్లో అప్రమత్తంగా కాపలా కాస్తున్నందువల్లే దేశ ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని పేర్కొన్నారు. దేశానికి సేవ చేస్తున్న ప్రతి జవాన్‌కు ఎన్ని వందనాలు చేసినా తక్కువేనన్నారు.

గ్రామ ఐక్యతను కాపాడుకోవాలి
అనంతరం ఆర్మీ జవాన్ గంగాధర్ మాట్లాడుతూ.. తాను చదువుకునే రోజుల్లో పోతంగల్‌లోని సినిమా థియేటర్‌కు సినిమాలు చూసేందుకు వెళ్లిన సందర్భాల్లో జరిగిన చిన్ననాటి సంఘటనలను గుర్తుచేసుకున్నారు. అప్పట్లో గ్రామస్థులంతా ఐకమత్యంతో ఉండేవారని, అదే ఐక్యతను నేటికీ కొనసాగించాలని కోరారు.

తన సేవలను గుర్తించి గ్రామస్థులు ఘనంగా సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దేశానికి సేవ చేయడం తనకు గర్వకారణమని, దేశ సేవ కోసం తనను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు. గ్రామంలో ఎవరికైనా తన వంతు సహాయ సహకారం అవసరమైతే ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

97 మంది విద్యార్థులకు దుస్తుల పంపిణీ
ఈ సందర్భంగా గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న 97 మంది విద్యార్థినీ, విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు. దేశ సేవతో పాటు గ్రామాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి తన వంతు సహకారం అందిస్తానని జవాన్ గంగాధర్ తెలిపారు.

కార్యక్రమంలో మాజీ ఏఎంసీ అధ్యక్షుడు నిరడి గంగాధర్, గోవింద్, సుభాష్, ఈరుగొండ, బాల్యమిత్రులు గంధపు దత్తు, అశోక్, నవీన్, నాగేష్ తదితర గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ గంగాధర్‌ను అభినందించి, భవిష్యత్తులోనూ దేశ సేవలో విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more