చిన్న వాహనాలకే కేసులా?.. పెద్ద వాహనాలకు ‘గ్రీన్ సిగ్నల్’నా?
బోధన్, ఆగస్టు 22: బోధన్ సరిహద్దు ప్రాంతాల్లో పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రివేళల్లో పీడీఎస్ బియ్యాన్ని వాహనాల్లో మహారాష్ట్రకు తరలిస్తున్నారని, అదే సమయంలో మహారాష్ట్ర క్వారీల నుంచి ఇసుక లారీలు తెలంగాణలోకి వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద సమర్థవంతమైన నిఘా కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
“దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు”
అక్రమ రవాణాదారులు, వారిని అడ్డుకోవాల్సిన వ్యవస్థ మధ్య ఏదైనా కుమ్మక్కు ఉందా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. పేరుకే చిన్నచిన్న వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారని, పెద్ద వాహనాలు మాత్రం రాత్రివేళల్లో సరిహద్దులు దాటుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, కొందరు అధికారుల అండదండలతోనే ఈ వ్యవహారం కొనసాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర నుంచి ఇసుక లారీల రాకపోకలపై కూడా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
“మామూళ్లకు మౌనం.. అక్రమాలకు అండ”
అన్నట్లుగా పరిస్థితి మారిందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులపైనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారిపై నిఘా పెట్టేది ఎవరు? చర్యలు తీసుకునేది ఎవరు? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చెక్‌పోస్టులు కేవలం పేరుకే కాకుండా.. రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా, వాహనాల తనిఖీలు చేపట్టి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సరిహద్దు మార్గాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, అక్రమ రవాణా వెనుక ఉన్న వ్యక్తులు, వ్యవస్థలోని బాధ్యులపై ఆరోపణలు నిజమైతే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







