“నమ్మకమే బంధానికి ప్రాణం.. ద్రోహమే జీవితానికి శాపం.”
చిత్తూరు, జూలై 16:
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కెనమాకులపల్లి పంచాయతీ పరిధిలోని బోయనపల్లి గ్రామానికి చెందిన యువతి, తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రెండేళ్ల క్రితం తమిళనాడులోని సూలగిరికి చెందిన రమేష్‌తో పెద్దలు వివాహం జరిపించారు. దంపతులకు ప్రస్తుతం ఏడు నెలల పాప ఉంది.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, యువతికి స్వగ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె, ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించినట్లు తెలుస్తోంది.
రెండు రోజుల క్రితం దంపతులు పుట్టింటికి వచ్చిన అనంతరం, మంగళవారం తమ చిన్నారితో కలిసి గుడుపల్లి మండలంలోని మల్లప్పకొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయానికి వెళ్లారు. ఈ విషయాన్ని యువతి ముందుగానే తన ప్రియుడికి తెలియజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఆలయానికి వెళ్లే మార్గంలో ప్రియుడు, అతని స్నేహితుడు బైకును అడ్డగించి రమేష్‌పై దాడి చేశారు. ప్రాణాలు కాపాడుకునేందుకు రమేష్ పారిపోవడానికి ప్రయత్నించినప్పటికీ, సుమారు 100 మీటర్ల వరకు వెంబడించి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం నిందితులు మృతుడి బైకుపైనే అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. దంపతులు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చేపట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మల్లప్పకొండపై ఓ మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, రమేష్ తన భార్యతో కలిసి ఆలయానికి వెళ్లినట్లు, అనంతరం భార్య ఇద్దరు వ్యక్తులతో కలిసి బైకుపై వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో భార్య, ఆమె ప్రియుడు, మరో వ్యక్తి కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
గ్రామస్థుల సమాచారం ప్రకారం, నిందితురాలైన యువతి ఇంకా మైనర్‌గా ఉండగా, ఆమె 9వ తరగతి చదువుతున్న సమయంలోనే రెండేళ్ల క్రితం వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంతో పాటు అన్ని అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







