రుద్రూరు సీఎఫ్‌ఎస్‌టీలో ఈగిల్ ఫోర్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం
రుద్రూరు, జూలై 16:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని రుద్రూరులోని కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (సీఎఫ్‌ఎస్‌టీ)లో తెలంగాణ పోలీసు శాఖ ఈగిల్ (EAGLE) ఫోర్స్ సహకారంతో గురువారం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థుల్లో మాదకద్రవ్యాల దుర్వినియోగంపై చైతన్యం కల్పించడం, డ్రగ్-ఫ్రీ క్యాంపస్ లక్ష్యాన్ని సాధించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వహించారు.
కళాశాల అసోసియేట్ డీన్ డా. కె. వెంకట్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, డీఎస్పీ సోమనాథన్, రుద్రూరు సీఐ కృష్ణ, ఈగిల్ టీమ్ సీఐ పూర్ణేశ్వర్, ఎస్‌ఐ మనోజ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేవలం ఆసక్తి, స్నేహితుల ఒత్తిడి లేదా మానసిక ఒత్తిడి కారణంగా డ్రగ్స్‌కు అలవాటు పడొద్దని హెచ్చరించారు. గంజాయి, హెరాయిన్ (బ్రౌన్ షుగర్), ఎండీఎంఏ (ఎక్స్టసీ), మెతాంఫెటమైన్, కొకైన్, ప్రిస్క్రిప్షన్ మందులు, కోడైన్ కలిగిన దగ్గు సిరప్‌ల దుర్వినియోగం వల్ల ఆరోగ్య, విద్య, కుటుంబ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తీవ్ర దుష్పరిణామాలు ఎదురవుతాయని వివరించారు. అనుమానాస్పద మాదకద్రవ్యాల కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు లేదా కళాశాల అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

యువతే దేశ భవిష్యత్తని పేర్కొంటూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఎన్‌ఎస్‌ఎస్ వంటి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. “డ్రగ్-ఫ్రీ క్యాంపస్ – డ్రగ్-ఫ్రీ సొసైటీ – డ్రగ్-ఫ్రీ ఇండియా” నిర్మాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామి కావాలని ఆకాంక్షించారు.
అసోసియేట్ డీన్ డా. కె. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసు శాఖ, ఈగిల్ ఫోర్స్ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని అన్నారు. కళాశాలలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్యాల రహిత విద్యా వాతావరణం ఏర్పడేందుకు ప్రతి విద్యార్థి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
కార్యక్రమం ముగింపులో విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది మాదకద్రవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించబోమని, ఇతరులను కూడా వాటికి దూరంగా ఉండేలా ప్రోత్సహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించి అతిథులకు కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







