“కష్టానికి తగిన ఫలితం దక్కితేనే పనికి గౌరవం.”
బోధన్, జూలై 16:
నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు రావాల్సిన పీఆర్సీ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం బోధన్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ కార్మికులకు ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, విధుల నిర్వహణకు అవసరమైన పనిముట్లు అందించాలని, పీఎఫ్, ఈఎస్ఐ సంబంధిత సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే సేవలో ఉండగానే మరణించిన లేదా పదవీ విరమణ పొందిన కార్మికుల వారసులకు ఉద్యోగావకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.

ధర్నా అనంతరం యూనియన్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. దీనికి స్పందించిన కమిషనర్, మూడు నెలల పీఆర్సీ బకాయిలను తక్షణమే విడుదల చేస్తామని, మిగిలిన మూడు నెలల బకాయిలను వచ్చే నెలలో చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఇతర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, మరణించిన లేదా పదవీ విరమణ చేసిన కార్మికుల వారసులను ఉద్యోగాల్లోకి తీసుకునే అంశంపై హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులతో చర్చించి ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకుడు బి. మల్లేష్, కార్మిక ప్రతినిధులు కే. గంగమణి, బి. సాయమ్మ, ఎం. అబ్బయ్య, సరోజన, నాగమణి, అబ్బవ్వ, పోసాని, రాణి తదితరులు, పెద్ద సంఖ్యలో మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







