ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు హెచ్చరిక
ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు.. విద్యార్థుల ఫిర్యాదులపై తక్షణ చర్యలకు ఆదేశం
హైదరాబాద్, జూలై 12:
ఫీజు బకాయిలు ఉన్నాయనే కారణంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు నిలిపివేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ జూనియర్ కాలేజీలపై తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా బోర్డు కఠిన వైఖరి అవలంబించింది. ఫీజు చెల్లింపుల పేరుతో విద్యార్థుల టీసీ, బోనఫైడ్, స్టడీ సర్టిఫికెట్లు లేదా ఇతర ఒరిజినల్ ధ్రువపత్రాలను ఇవ్వకుండా నిలిపివేయడం చట్టవిరుద్ధమని బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ స్పష్టం చేశారు.
విద్యార్థులు కోరిన వెంటనే అన్ని సర్టిఫికెట్లను జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సంబంధిత కళాశాలల గుర్తింపు (అఫిలియేషన్) రద్దు చేసే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారులకు (డీఐఈఓలు) ఆదేశాలు జారీ చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు వద్ద
ప్రస్తుతం ఇంజినీరింగ్, అగ్రికల్చర్, డిగ్రీ, నర్సింగ్ తదితర ఉన్నత విద్యా కోర్సుల ప్రవేశాల కోసం వెబ్ కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇలాంటి కీలక సమయంలో సర్టిఫికెట్లు ఇవ్వకుండా కాలేజీలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం వల్ల వారి విద్యా, ఉద్యోగ అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని బోర్డు ఆందోళన వ్యక్తం చేసింది.
ఫీజు బకాయిల సమస్యలను చట్టపరంగా లేదా పరిపాలనా పరంగా పరిష్కరించుకోవాల్సిందే కానీ, విద్యార్థుల సర్టిఫికెట్లను బందీ చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది.
షోకాజ్ నోటీసులు.. అఫిలియేషన్ రద్దుకు చర్యలు
బోర్డు ఆదేశాలను పాటించని కాలేజీలకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అఫిలియేషన్ రద్దు ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలు ఉల్లంఘించే విద్యాసంస్థలపై కఠిన క్రమశిక్షణా చర్యలు తప్పవని బోర్డు హెచ్చరించింది.
ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్
విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రతి జిల్లా డీఐఈఓ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్న కాలేజీలపై విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని, అందిన ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలని బోర్డు సూచించింది. అలాగే నిబంధనలు ఉల్లంఘించే కాలేజీలపై తీసుకున్న చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
Author: पेंडकर श्रीनिवास
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832








