-- --

బీడీ కార్మికులకు పని కల్పించాలని ధర్నా – చర్చలకు యాజమాన్యం అంగీకారం

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ఆర్.డి. పటేల్ కంపెనీ ఎదుట TUCI ఆధ్వర్యంలో నిరసన.. రాస్తారోకోతో ట్రాఫిక్‌కు అంతరాయం.. ఈ నెల 21–23 మధ్య చర్చించి సమస్య పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ

బాల్కొండ/ఎడపల్లి, జూలై 10:
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాత ట్రేడర్స్ బీడీ కంపెనీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం తమకు పని కల్పించాలని డిమాండ్ చేస్తూ బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లోని ఆర్.డి. పటేల్ బీడీ కంపెనీ ఎదుట తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఆధ్వర్యంలో బీడీ కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ ప్రతినిధులతో చర్చించేందుకు యాజమాన్యం తొలుత నిరాకరించడంతో కార్మికులు రాస్తారోకోకు దిగారు.

రాస్తారోకో కారణంగా రహదారికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యాజమాన్యంతో మాట్లాడి చర్చలకు అంగీకరింపజేయడంతో కార్మికులు రాస్తారోకో విరమించారు.

యూనియన్ నాయకుల వివరాల ప్రకారం, ఎడపల్లిలోని శ్రీ మాత ట్రేడర్స్‌తో కిసాన్‌నగర్‌లోని ఆర్.డి. పటేల్ బీడీ కంపెనీ ఐదేళ్లపాటు నెలకు 525 కార్టూన్ల బీడీల సరఫరాకు ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందం మేరకు 2025 సెప్టెంబర్ వరకు బీడీ కార్మికులతో బీడీలు తయారు చేయించి పంపించినప్పటికీ, అక్టోబర్ నుంచి కార్మికులకు పని ఇవ్వడం నిలిపివేశారని తెలిపారు. దీంతో గత పది నెలలుగా వందలాది కార్మికులు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పలు మార్లు యాజమాన్యంతో చర్చలు జరిపినా పని ఇస్తామని హామీలు మాత్రమే ఇస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారం కోసం ధర్నా చేపట్టినట్లు తెలిపారు.

పోలీసుల సమక్షంలో జరిగిన చర్చల అనంతరం, ఈ నెల 21 నుంచి 23 తేదీల మధ్య కంపెనీ యాజమాన్యం వచ్చి యూనియన్ ప్రతినిధులతో చర్చించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని సెంటర్ మేనేజర్ హామీ ఇచ్చినట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఒకవేళ చర్చలు విఫలమైతే జరిగే పరిణామాలకు కంపెనీ యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో TUCI రాష్ట్ర నాయకులు ఎం. ముత్తన్న, కే. రాజన్న, జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్, వి. సత్తెమ్మ, సహాయ కార్యదర్శి ఆర్. రమేష్, నాయకులు రాజేశ్వర్, అరవింద్తో పాటు పెద్ద సంఖ్యలో బీడీ కార్మికులు పాల్గొన్నారు.

पेंडकर श्रीनिवास
Author: पेंडकर श्रीनिवास

V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832

Leave a Comment

Read more
Read more