Post Views: 134
ప్రశ్నించే విద్యార్థి నాయకత్వం మాయమైందా..? విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేయడానికి ఇంకా ఎన్ని ఫిర్యాదులు రావాలి..?
బోధన్, జూన్ 25:
విద్యార్థుల హక్కుల కోసం పోరాడతామని, అన్యాయం జరిగితే వీధుల్లోకి వస్తామని చెప్పే విద్యార్థి సంఘాలు నేడు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్న తల్లిదండ్రులు, ప్రజల నుంచి గట్టిగా వినిపిస్తోంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లు, బలవంతపు పుస్తకాల కొనుగోళ్లు, యూనిఫాంల పేరుతో అదనపు భారం, విద్యార్థులపై మానసిక ఒత్తిళ్లు వంటి ఆరోపణలు పెరుగుతున్నప్పటికీ విద్యార్థి సంఘాల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన కనిపించడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒకప్పుడు చిన్న సమస్య వచ్చినా కళాశాలలు, పాఠశాలల ఎదుట నిరసనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు ఇప్పుడు వేలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విద్య హక్కు కోసం పోరాడాల్సిన సంఘాలు నేడు నిశ్శబ్దంగా ఉండటం వెనుక కారణమేంటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో కొందరు యాజమాన్యాలు తమకు అనుకూలమైన దుకాణాల నుంచే పుస్తకాలు, యూనిఫాంలు కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్‌లో తక్కువ ధరకే లభించే వస్తువులను కొనుగోలు చేయకుండా అడ్డుకోవడం, అధిక ధరలకు విక్రయించడం వంటి అంశాలపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎంతమంది సంస్థలను తనిఖీ చేశారు..? ఎన్ని కేసులు నమోదు చేశారు..? ఎలాంటి చర్యలు తీసుకున్నారనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత విద్యాశాఖపై ఉందని తల్లిదండ్రులు అంటున్నారు.

అధికారుల నిర్లక్ష్యం, విద్యార్థి సంఘాల మౌనం కారణంగా కొందరు విద్యాసంస్థలు మరింతగా నియంత్రణ లేకుండా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫీజుల పేరుతో విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపించడం, తల్లిదండ్రులను అవమానకర పరిస్థితుల్లో నిలబెట్టడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

“విద్యార్థుల సమస్యలపై పోరాడతామని చెప్పిన విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి..? విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల కష్టార్జిత సంపాదన దోపిడీకి గురవుతుంటే ఎందుకు స్పందించడం లేదు..?” అని ప్రజలు నిలదీస్తున్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నిర్మాణం, పుస్తకాల విక్రయాలు, యూనిఫాంల కొనుగోళ్లపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకొని నివేదికను ప్రజల ముందుంచాలని కోరుతున్నారు.
ఇకనైనా విద్యార్థి సంఘాలు తమ బాధ్యతను గుర్తించి విద్యార్థులు, తల్లిదండ్రుల పక్షాన నిలబడాలని, విద్యను వ్యాపారంగా మార్చే ధోరణిపై ఉద్యమించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రజల నిలదీత..
“విద్యార్థి సంఘాలారా… మీ పోరాటాలు పోస్టర్లకే పరిమితమయ్యాయా..? విద్యార్థుల కన్నీళ్లు కనిపించడం లేదా..?”
“విద్యాశాఖ అధికారులారా… తనిఖీలు ఎప్పుడు..? చర్యలు ఎప్పుడు..? లేక ఫిర్యాదులు కాగితాలకే పరిమితమా..?”
“విద్య సేవగా ఉండాలా..? వ్యాపారంగా మారాలా..? సమాధానం చెప్పాల్సింది ఎవరు..?”
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832












