ఒకే డీడీపై పలుమార్లు ట్రిప్పుల ఆరోపణలు – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం
తక్షణ విచారణ చేపట్టి అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్
సాలూరా మండలం, ప్రత్యేక ప్రతినిధి:
సాలూరా మండల పరిధిలోని మంజీరా నది తీర ప్రాంతాల్లో ఇసుక అక్రమ రవాణా మళ్లీ జోరందుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తగ్గేల్లి ప్రాంతం నుంచి నిబంధనల మేరకు ఇసుక రవాణాకు అనుమతులు జారీ చేస్తున్నప్పటికీ, అదే అనుమతులను అడ్డం పెట్టుకుని మందర్నా గ్రామ పరిధి నుంచి కూడా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు వెల్లడిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, తగ్గేల్లి నుంచి అనుమతులు పొందిన ట్రాక్టర్లతో పాటు జీరో ట్రాక్టర్లను ఉపయోగించి బోధన్ వైపు పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోందని చెబుతున్నారు. అనుమతులు లేని ప్రాంతాల నుంచి ఇసుకను తవ్వి తరలిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమర్థవంతమైన తనిఖీలు నిర్వహించడం లేదని ఆరోపిస్తున్నారు.


అత్యంత ఆందోళనకరమైన అంశంగా, ఒకే డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) లేదా అనుమతి పత్రాన్ని పలుమార్లు వినియోగిస్తూ అనేక ట్రిప్పులు చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా, సహజ వనరుల దోపిడీ కూడా జరుగుతోందని వారు పేర్కొంటున్నారు.
ఈ విషయంపై పలుమార్లు రెవెన్యూ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించకపోవడంతో అక్రమ రవాణాదారులకు మరింత ధైర్యం వస్తోందని విమర్శిస్తున్నారు.
మంజీరా నది పరివాహక ప్రాంతంలో జరుగుతున్న ఇసుక రవాణాపై ఉన్నతాధికారులు ప్రత్యేక బృందంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న దిగువ స్థాయి అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అధికారులు తక్షణమే స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే ఉద్యమానికి దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







