నేత్రదానం.. మహాదానం
మరణానంతరం నేత్రదానం చేసి ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపాలి : పోలవరపు బసవేశ్వరరావు..
బోధన్, జూన్ 10:
“మనిషి జీవితానికి కళ్లు వెలుగు అయితే, నేత్రదానం మరొకరి జీవితానికి కొత్త ఉదయం” అనే సందేశంతో ప్రపంచ నేత్రదాన దినోత్సవాన్ని బోధన్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, సభ్యులు నేత్రదానం ప్రతిజ్ఞ చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా లయన్స్ కంటి ఆసుపత్రి వ్యవస్థాపకులు, లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ పోలవరపు బసవేశ్వరరావు మాట్లాడుతూ, ప్రతి వ్యక్తి మరణానంతరం నేత్రదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. సమాజంలో ఇంకా నేత్రదానంపై ఉన్న అపోహలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.

నేత్రదానం ప్రక్రియలో కళ్లను పూర్తిగా తొలగించరని, కంటి నల్లగుడ్డులోని కార్నియాను మాత్రమే సేకరిస్తారని వివరించారు. అందువల్ల కుటుంబ సభ్యులు ఎలాంటి సందేహాలు, భయాలు పెట్టుకోకుండా నేత్రదానానికి ప్రోత్సహించాలని సూచించారు.

“మరణించిన తర్వాత మట్టిలో కలిసే కళ్లు, మరొకరి జీవితంలో వెలుగులు నింపగలవు” అని పేర్కొంటూ, నేత్రదానం ద్వారా అంధుల జీవితాల్లో ఆశాజ్యోతి వెలిగించవచ్చని అన్నారు. ప్రతి కుటుంబం కనీసం ఒక నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని కోరారు.
కార్యక్రమంలో లయన్స్ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్లు ఎర్రగడ్ల శ్రీనివాస్, కొడాలి కిషోర్, ఉమేష్ సిందే, నేత్ర వైద్యులు డాక్టర్ మనీష్ కుమార్, డాక్టర్ ఓమ్న రెడ్డి, డాక్టర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







