బుకింగ్ యాప్ ద్వారా పారదర్శక పంపిణీ – రైతులు అపోహలు నమ్మొద్దు
ఎరువుల గోడౌన్లు, విక్రయ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జూన్ 9 (ప్రతినిధి):
జిల్లాలో రైతులకు యూరియా కొరత తలెత్తకుండా అన్ని స్టాక్ పాయింట్లు, సహకార సంఘాల గోడౌన్లలో తగిన నిల్వలు అందుబాటులో ఉంచుతున్నామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానాకాలం సాగు అవసరాలకు సరిపడా ఎరువులు జిల్లాలో నిల్వ ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.
మంగళవారం ఎడపల్లి మండలంలోని జానకంపేట్, ఎడపల్లి ప్రాంతాల్లో ఉన్న ఎరువుల గిడ్డంగులు, విక్రయ కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లలో నిల్వ ఉన్న యూరియా, ఇతర ఎరువుల పరిమాణాన్ని పరిశీలించి, స్టాక్ రిజిస్టర్లలో నమోదైన వివరాలతో సరిపోల్చి పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన ఎరువుల నిల్వలు, పంపిణీ చేసిన పరిమాణం, ఇంకా రావాల్సిన స్టాక్‌పై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా యూరియా బుకింగ్ యాప్ పనితీరును పరిశీలించిన కలెక్టర్, రైతులకు దాని ప్రయోజనాలను వివరించారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయని పేర్కొన్నారు. యాప్ ద్వారా ఎరువులు పక్కదారి పట్టకుండా రైతులకు ప్రణాళికాబద్ధంగా అందజేయడం సాధ్యమవుతుందని చెప్పారు. గత రబీ సీజన్‌లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ విధానం విజయవంతంగా అమలైందని గుర్తు చేశారు.

నానో యూరియా వినియోగంపై కూడా రైతులకు అవగాహన కల్పించిన కలెక్టర్, ప్రయోగాత్మకంగా కొంత మేర వినియోగించి ఫలితాలను పరిశీలించాలని సూచించారు. అయితే రైతులను నానో యూరియా లేదా ఇతర ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఎవరూ బలవంతం చేయరాదని హెచ్చరించారు. రైతులపై ఒత్తిడి తెచ్చే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లాలో ప్రస్తుతం 27 వేల మెట్రిక్ టన్నులకుపైగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అన్ని ప్రాంతాలకు నిల్వలను తరలిస్తున్నామని చెప్పారు. కొన్ని సహకార సంఘాలు డిఫాల్ట్‌లో ఉన్నప్పటికీ, ఆ పరిధిలోని రైతులకు ఎరువుల కొరత రాకుండా డీసీఎంఎస్ ద్వారా పంపిణీ చేపడుతున్నట్లు వెల్లడించారు.
బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో ముందస్తు విత్తనాల కారణంగా ఇప్పటికే ఎరువుల పంపిణీ ప్రారంభించామని, తదుపరి నిజామాబాద్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో కూడా పక్కాగా పంపిణీ జరిగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మోతాదుకు మించి ఎరువులు, క్రిమిసంహారక మందులు వినియోగించకుండా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు సూచించారు.
ఈ తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి, జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ దత్తాద్రి, జానకంపేట్ సర్పంచ్ అనురాధ, సొసైటీ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







