పరిశుభ్రత, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాల నివారణపై అవగాహన..
బోధన్, జూన్ 8 (ప్రతినిధి):
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని టీటీడీ కళ్యాణ మండపంలో ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా 21వ వార్డు నుంచి 30వ వార్డు వరకు సంయుక్త వార్డు సభలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అభివృద్ధి, పరిశుభ్రత, ఓటర్ల జాబితా సవరణ, సైబర్ నేరాల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి బోధన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకటనారాయణ, మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ గణేష్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, మెప్మా పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్ తదితర అధికారులు హాజరయ్యారు.
సభలో మెప్మా సమన్వయకర్త మాట్లాడుతూ బోధన్ పట్టణాన్ని పరిశుభ్రమైన, ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమని పేర్కొన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ వాహనాలకు మాత్రమే అందించాలని, డ్రైనేజీల్లో చెత్త వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు దోమల వ్యాప్తిని నివారించేందుకు నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.

మండల ఆర్‌ఐ శ్రీనివాస్ ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ప్రతి ఓటరు తమ పేరు జాబితాలో సక్రమంగా నమోదైందో లేదో ధృవీకరించుకోవాలని సూచించారు. వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, బీఎల్‌వోలు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
టౌన్ సీఐ వెంకటనారాయణ మాట్లాడుతూ యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని, గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దని హెచ్చరించారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో జరుగుతున్న మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు.
అలాగే శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి వార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని, మైనర్లకు వాహనాలు అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, వార్డు అధికారులు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, మున్సిపల్ ఉద్యోగులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1 News & Daily Newspaper is Hiring Reporters V1 News & Daily Newspaper invites applications from enthusiastic and dedicated individuals to join our team as Reporters. Interested candidates can contact: PENDKAR SRINIVAS 📞 9603925163 📞 9834485832







