‘తెలంగాణ దర్శిని’కి రూ.11.69 కోట్ల నిధులు మంజూరు
2వ తరగతి నుంచి డిగ్రీ వరకు 2.92 లక్షల మంది విద్యార్థులకు అవకాశం – ఒక్కో విద్యార్థిపై రోజుకు రూ.900 ఖర్చు
హైదరాబాద్, నవంబర్ 18 (వి1 న్యూస్): తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదను విద్యార్థులకు ప్రత్యక్షంగా పరిచయం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమానికి రూ.11.69 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్ జీవో నంబర్ 341 జారీ చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 2,92,286 మంది విద్యార్థులకు విద్యా, సాంస్కృతిక విజ్ఞాన యాత్రలు నిర్వహించనున్నారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ), విద్యాశాఖ సమన్వయంతో ఈ యాత్రలను చేపట్టనున్నాయి.
ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900
ఈ విజ్ఞాన యాత్రల నిర్వహణలో భాగంగా ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.900 చొప్పున ఖర్చు చేయనున్నారు. ఇందులో సమగ్ర శిక్షా అభియాన్ కింద విద్యాశాఖ రూ.500, పర్యాటక శాఖ రూ.400 చొప్పున భరించనున్నాయి. ఈ కార్యక్రమానికి మొత్తం రూ.26.30 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేయగా, ఇందులో విద్యాశాఖ వాటా రూ.14.61 కోట్లు, పర్యాటక శాఖ వాటా రూ.11.69 కోట్లుగా నిర్ణయించారు. విద్యార్థులకు రవాణాతో పాటు ఇతర పర్యాటక సేవలు కల్పించనున్నారు.
పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి విజ్ఞానం
విద్యార్థులు తరగతి గదుల్లో పుస్తకాల ద్వారా తెలుసుకున్న చారిత్రక అంశాలను ప్రత్యక్షంగా సందర్శించి అర్థం చేసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, మ్యూజియంలు, సాంస్కృతిక ప్రదేశాలు, సహజ పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ద్వారా విద్యార్థులకు రాష్ట్ర గొప్పతనంపై అవగాహన పెరుగుతుంది.
అంతేకాకుండా చిన్నతనం నుంచే మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ కట్టడాల పరిరక్షణపై విద్యార్థుల్లో ఆసక్తి, బాధ్యత పెంపొందించేందుకు ఈ యాత్రలు దోహదపడనున్నాయి. పుస్తక విజ్ఞానానికి క్షేత్రస్థాయి అనుభవాన్ని జోడించడం ద్వారా విద్యార్థులకు మరింత ఆసక్తికరమైన అభ్యాసన అనుభవం కలగనుంది.
తెలంగాణ చరిత్రను భావితరాలకు పరిచయం చేస్తూ, విద్యతో పాటు సాంస్కృతిక అవగాహనను పెంపొందించే దిశగా ‘తెలంగాణ దర్శిని’ కార్యక్రమం కీలకంగా నిలవనుంది.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”







