భారత రాయబార కార్యాలయంలో జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు.. బిర్సా ముండా పోరాట స్ఫూర్తిని స్మరించుకున్న ప్రవాస భారతీయులు…
రియాధ్, నవంబర్ 15(వన్ న్యూస్ తెలంగాణ):
భారతదేశ ఆదివాసీ సమాజ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెబుతూ సౌదీ అరేబియా రాజధాని రియాధ్‌లో జన్‌జాతీయ గౌరవ దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని శనివారం సాయంత్రం భారతీయ రాయబార కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివాసీ వారసత్వ వైభవాన్ని ప్రతిబింబించింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భారత రాయబారి విపుల్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది వీరయోధులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని, అయితే వారిలో అనేకమంది మహనీయుల త్యాగాలు, పోరాట గాథలు భవిష్యత్ తరాలకు పూర్తిస్థాయిలో తెలియకుండా పోయాయని అన్నారు. అటువంటి మహనీయుల్లో ఆదివాసీ సమాజం ఆరాధించే భగవాన్ బిర్సా ముండా ఒకరని పేర్కొన్నారు.

బిర్సా ముండా త్యాగానికి, ధైర్యానికి, పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు. ఆదివాసీ సమాజ హక్కులు, సంక్షేమం, గౌరవం కోసం ఆయన సాగించిన పోరాటం చిరస్మరణీయమని పేర్కొంటూ ఘనంగా నివాళులర్పించారు. దేశ చరిత్రలో ఆదివాసీ వీరుల పాత్రను గుర్తించడం, వారి త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఆదివాసీ సంస్కృతికి ప్రవాస గడ్డపై విశేష గుర్తింపు…
భారతీయ రాయబార కార్యాలయం, ప్రవాస భారతీయుల సంఘం గ్లోబల్ ఇండియన్ ఆర్గనైజేషన్ (GIO) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తెలుగు ప్రవాసీ సంఘం సాటా (SATA) సహాయ సహకారాలు అందించింది.
ఈ సందర్భంగా సాటా వ్యవస్థాపక అధ్యక్షుడు మల్లేశన్ మాట్లాడుతూ.. పొట్టకూటి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే ఆదివాసీ ప్రజలు నేడు ఉపాధి అవకాశాల కోసం గల్ఫ్ దేశాలకు సైతం వస్తున్నారని తెలిపారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు జీవనోపాధి కోసం తెలంగాణ, కేరళ వంటి రాష్ట్రాలకు వలస వస్తున్నారని, అలాగే ఈ రాష్ట్రాల నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం పెద్ద సంఖ్యలో వలసలు కొనసాగుతున్నాయని వివరించారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రతి కార్యక్రమంలో సాటా చురుగ్గా పాల్గొంటుందని ఆయన పేర్కొన్నారు. ఆదివాసీ సమాజ గొప్పతనాన్ని, వారి సంస్కృతిని అంతర్జాతీయ వేదికలపై పరిచయం చేయడం గర్వకారణమని తెలిపారు.
కొమరం భీం పాటతో ఆకట్టుకున్న ప్రవాసీయుడు…
కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీల పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన కొమరం భీంపై ప్రవాస భారతీయుడు రేలంగి రాం తెలుగులో ఆలపించిన పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన గానం అక్కడి వారిని ఆకట్టుకుంది.
అదేవిధంగా ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఆదివాసీ సమాజాల జీవన విధానం, సంప్రదాయాలు, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే కళారూపాలను జియో సభ్యులు ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు భారతదేశ గిరిజన సంస్కృతిలోని వైవిధ్యాన్ని, కళా సంపదను చాటిచెప్పాయి.

వివిధ ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు కలిగిన ఆదివాసీ సమాజాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని పెంపొందించడంతో పాటు, భారతీయ వారసత్వాన్ని విదేశీ గడ్డపై పరిచయం చేసే వేదికగా ఈ వేడుక నిలిచింది.
ఈ కార్యక్రమంలో జియో ప్రతినిధులు విశాల్, రమేశ్, హర్షల, షగుఫ్తా, సాటా ప్రతినిధులు ముజ్జమ్మీలొద్దీన్, నూరోద్దీన్, నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
Author: వాస్తవాలపై ముందడుగు
V1newstelangana.... కలం అమ్ముడుపోకూడదు.. వార్త వంగిపోకూడదు!” “నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నిజమైన జర్నలిజం!” “ప్రజా సమస్యలే మా ప్రాధాన్యం.. ప్రజల హక్కులే మా బాధ్యత!”








